|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:31 PM
హైదరాబాద్ శివార్లలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడేందుకు అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, గండిగూడ గ్రామంలోని 12.17 ఎకరాల ప్రభుత్వ భూమిని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన అధీనంలోకి తీసుకుంది. మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి ధర సుమారు రూ.1200 కోట్లు ఉంటుందని అంచనా.స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం హైడ్రా అధికారులు సంబంధిత శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అక్రమ కబ్జాలు జరుగుతున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత, వెంటనే ఆ భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని, హైడ్రా పరిరక్షణలో ఉందని స్పష్టం చేస్తూ హెచ్చరిక బోర్డులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మిగిలిన ఖాళీ స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాపాడటమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.