|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 12:26 PM
హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలోని శ్రీనివాస్ నగర్ బ్రిడ్జి వద్ద 3000 మీమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ కి లీకేజీలను ఆరికట్టడానికి పైపులైనుకు అత్యవసరంగా మరమ్మత్తులు చేపట్టారు. ఈ నేపథ్యంలో లీకేజీ ఘటన.. మరమ్మతులపై ఎండీ అశోక్ రెడ్డి జలమండలి ఈడీతో కలిసి అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరమ్మతుల పనులపై తాజా పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్‌మిషన్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు.
లీకేజీ వల్ల నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. అలాగే అంతరాయానికి సంబంధించి ప్రతి జీఎం తన పరిధిలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలన్నారు.
ఏయే ప్రాంతాలు, ఎన్ని కనెక్షన్లు ప్రభావితమవుతాయో నివేదిక తయారు చేసుకోవాలన్నారు. దానికి అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయడానికి ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. మరమ్మతు ప్రాంతంలో ఉన్నతాధికారుల బృందం పర్యవేక్షించేందుకు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 24 గంటలూ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నీటి సరఫరా అంతరాయం సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలన్నారు.
లైన్ మెన్లు, మీటర్ రీడర్ల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు విషయం తెలియజేయాలన్నారు. స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మేల్యేలతో మాట్లాడి వారితో సమావేశాలు నిర్వహించి నీటిని నిల్వ చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.
ఇప్పటికే డీ వాటరింగ్ పనులు పూర్తి చేసి వెల్డింగ్ పనులు మొదలుపెట్టామని చెప్పారు. ఈ వెల్డింగ్ పనులు సాయంత్రం 4 గంటలకు పూర్తి చేస్తారు. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 03.01.2026, శనివారం రాత్రి 12 గంటల వరకు 18 గంటల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఎండీ ఆదేశించారు. సంపులు, స్టోరేజీ సామర్థ్యం ఉన్నవాళ్లు నీటి నిల్వ చేసుకోవాలని, ప్రజలందరూ ఈ సమయంలో నీటి వృథాను అరికట్టి, పొదుపుగా వాడుకోవాలని కోరారు.
పర్యవేక్షిస్తున్న ఎండీ.. ఈడీ..!
ఈ సందర్భంగా ఎండీ మరమ్మతులును పనులను సమీక్షించాలని జలమండలి సూచించారు. మరమ్మతులను గంట గంటకు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ రాత్రికి వరకు పూర్తిచేసి నీటి సరఫరా పునరుద్ధరణ చేయడానికి అవసరమైతే మరిన్ని గ్యాంగ్ లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు వారు ఆదేశించారు. పనులను వేగవంతం చేయడానికి మైక్రో లెవల్లో ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు.