|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 09:40 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ హైవేపై టోల్ ఫీజు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే వాహనదారులకు మాత్రమే ఈ వెసులుబాటు కోరడంపై సోషల్ మీడియాలో తెలంగాణ వాదుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఊరటనిచ్చేలా టోల్ ఫీజు మినహాయింపును ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు. 'సంక్రాంతికి ఏపీ వైపు వెళ్లే వారికే కాదు, మన తెలంగాణ గడ్డపై జరిగే అతిపెద్ద జాతర మేడారానికి వెళ్లే భక్తుల కోసం కూడా టోల్ ఫీజు మినహాయింపుపై కసరత్తు చేస్తున్నాం' అని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒక ప్రాంతానికే కాకుండా రాష్ట్రంలోని ప్రయాణికులందరి సౌకర్యాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుందని ఆయన వివరించారు.
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) పరిధిలోకి వస్తాయని మంత్రి గుర్తు చేశారు. అందుకే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశామని, ఇందులో ఎలాంటి రాజకీయ వివక్ష లేదని ఆయన పేర్కొన్నారు. కేవలం కొన్ని వర్గాల ప్రజలను ఉద్దేశించే ఈ నిర్ణయం తీసుకున్నామన్న సోషల్ మీడియా ప్రచారాలను తాము పట్టించుకోమని, తమ లక్ష్యం ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించడమేనని తేల్చి చెప్పారు.
ఈ ఏడాది జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించి, ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు తాగునీరు, రవాణా, పారిశుధ్యం, భద్రత విషయంలో ఎక్కడా లోటు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారని కోమటిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో టోల్ ఫీజు మినహాయింపు కూడా అమలైతే.. ప్రైవేటు వాహనాల్లో వచ్చే లక్షలాది మంది భక్తులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.