|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 06:58 AM
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందంఅధికారులు నిన్న రెండోసారి విచారించారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు ఆయనను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. గతంలో 2024 సెప్టెంబర్‌లో మూడు గంటల పాటు విచారించిన సిట్, ఈసారి దాదాపు ఎనిమిది గంటల పాటు నిరంతరంగా ప్రశ్నలు అడిగింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వ్యక్తులతో నవీన్ రావుకు ఉన్న పరిచయాలు, సంబంధాలపైనే ప్రధానంగా విచారణ కొనసాగింది.విచారణ అనంతరం నవీన్ రావు మీడియాతో మాట్లాడుతూ గత విచారణలో అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని, తాను అన్ని విధాలా విచారణకు సహకరించానని తెలిపారు. మళ్లీ విచారణకు రావాలని చెప్పలేదని, అయితే అవసరమైతే ఎప్పుడైనా విచారణకు రావడానికి సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. డివైజ్‌ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేశానన్న ఆరోపణలను ఆయన ఖండించారు.ఈ అంశంపై కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందిస్తూ, ఎలాంటి ఆధారాలు లేకుండా విచారణలు జరుపుతున్నారని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమని, ఫోన్ ట్యాపింగ్, కార్ రేసు కేసుల పేరుతో బీఆర్‌ఎస్ పార్టీపై దాడి జరుగుతోందని ఆయన విమర్శించారు.