|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 07:51 PM
సాధారణంగా ఒక ఊరి పేరు ఆ ప్రాంత చరిత్రకో, సంస్కృతికో లేదా ఆ గడ్డపై నడయాడిన వీరుల ఠీవికో ప్రతీకగా నిలుస్తుంది. తరతరాల గుర్తింపును మోసే ఆ పేర్లు గ్రామస్తులకు గర్వకారణంగా ఉంటాయి. కాని కొన్ని గ్రామాల పేర్లు పలకడానికి అసభ్యకరంగా, వినేవారికి అసహ్యంగా మారి ఆ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి. అలాంటి కోవలోకే వస్తుంది కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సమీపంలోని ఓ గ్రామం. ఒక ఊరి పేరు చెప్పుకోవడానికే అక్కడి ప్రజలు సిగ్గుపడాల్సి రావడం, సామాజికంగా అవమానాలు ఎదుర్కోవడం దశాబ్దాలుగా వారిని వేధిస్తున్న సమస్య.
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆ గ్రామం పేరు ఉచ్చరించడానికి అత్యంత అభ్యంతరకరంగా ఉందని.. ఆ పేరును వెంటనే మార్చాలని ఆయన సభా వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో ఆ గ్రామం పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగజ్‌నగర్ పట్టణానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక గ్రామం పేరు రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ 'ల**గూడ' అని ఉండటంపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఆ పేరును ప్రస్తావించడానికి కూడా ఆయన సంకోచించారు. ఒక ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలోని గ్రామం పేరును స్పెల్లింగ్‌తో (L-A-N-J-A Guda) సహా చెప్పాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
'ఆ ఊరి పేరు పలకడానికే ఇబ్బందిగా ఉంది. ఒక చోట ఆ పేరు చెప్పాల్సి వస్తే అక్కడి వారు నవ్వుతున్నారు. ఆ గ్రామంలో నివసించే వారు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు తమ ఊరి పేరు చెప్పుకోవడానికి తీవ్రంగా అవమానపడుతున్నారు.' అని హరీష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఇప్పటికే సామాజికంగా తమ గ్రామం పేరును 'నందిగూడ'గా మార్చుకున్నారన్నారు. అన్ని శుభకార్యాల పత్రికల్లో, స్థానిక బోర్డులపై నందిగూడ అనే రాసుకుంటున్నారని చెప్పారు. కానీ ప్రభుత్వ అధికారిక రికార్డులు, రెవెన్యూ పత్రాలు, ఆధార్ కార్డులు, ఇతర ధ్రువీకరణ పత్రాల్లో మాత్రం పాత పేరే కొనసాగుతోందని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ పేరును ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రికార్డుల్లో కూడా పేరును మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎమ్మెల్యే హరీష్ బాబు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. 'నిజంగా ఆ పేరు పలకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పేర్లను మార్చడంలో జాప్యం ఎందుకు?' అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం తీసుకుని వెంటనే ఆ ఊరి పేరును 'నందిగూడ'గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. భాషలో అసభ్యకరంగా ధ్వనించే పేర్లు ఉండటం వల్ల ఆ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుందని.. ఆ గ్రామస్తుల గౌరవాన్ని కాపాడేలా ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.