|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 07:20 PM
మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ గెరిల్లా ఆర్మీ (PLGA) చీఫ్, మోస్ట్ వాంటెడ్ నేత బర్సే సుక్కా అలియాస్ దేవా ఇవాళ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవాతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి, ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి సహా మొత్తం 20 మంది సభ్యులు ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతిలో చేరారు. ఈ భారీ లొంగుబాటు పీఎల్‌జీఏ పతనానికి నాంది అని పోలీసులు భావిస్తున్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు తమతో పాటు భారీగా అత్యాధునిక ఆయుధాలను తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. ఇందులో ఇజ్రాయెల్ తయారీ టవర్ వెపన్, యూఎస్ఏ తయారీ కోల్ట్ ఆయుధాలు ఉండటం గమనార్హం. వీటితో పాటు 8 ఏకే-47 తుపాకులు, 2 ఎల్‌ఎమ్‌జీలు, 8 ఎస్‌ఎల్‌ఆర్‌లు, 4 బ్యారేల్ గ్రానైడ్ లాంచర్లు, హెలికాప్టర్లను సైతం కూల్చే సామర్థ్యం ఉన్న ఆయుధ సామగ్రిని డీజీపీకి అప్పగించారు. అలాగే తమ వద్ద ఉన్న రూ. 20 లక్షల నగదును కూడా పోలీసులకు అప్పగించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన దేవా.. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మాకు అత్యంత సన్నిహితుడు. హిడ్మా సొంత గ్రామానికి చెందిన వాడైన దేవాపై ఎన్‌ఐఏ రూ. 75 లక్షల రివార్డు ప్రకటించింది. పీఎల్‌జీఏ బెటాలియన్‌లో ఒకప్పుడు 400 మంది సభ్యులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 66కు పడిపోయిందని దేవా లొంగుబాటుతో ఈ విభాగానికి వెన్నెముక విరిగినట్లయిందని డీజీపీ తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు, ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీల పట్ల ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున రూ. 1.80 కోట్ల రివార్డు సొమ్మును అందజేయనున్నారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికీ రూ. లక్ష నగదును డీజీపీ పంపిణీ చేశారు. రాజిరెడ్డి లొంగుబాటుతో తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారని.. మొత్తం మీద తెలంగాణ నుంచి పార్టీలో ఉన్న సభ్యుల సంఖ్య 17కు తగ్గిందని అధికారులు స్పష్టం చేశారు. అడవిలో అనాలోచిత పోరాటం మానుకొని, మిగిలిన సభ్యులు కూడా లొంగిపోయి సమాజ సేవలో భాగస్వాములు కావాలని డీజీపీ శివధర్ రెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.