|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 09:06 PM
వీధి కుక్కల కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గురువారం జరిగిన విచారణలో పిల్లుల ప్రస్తావన కూడా రావడం గమనార్హం. వీధుల్లో ఉన్న అన్ని కుక్కలను పూర్తిగా తరలించాలన్న ఆదేశాలు తాము ఇవ్వలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేవలం సంస్థలు, కార్యాలయాలు వంటి ప్రదేశాల నుంచి మాత్రమే వీధి కుక్కలను తరలించేందుకు అనుమతి ఇస్తున్నామని తెలిపింది.ఈ సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కుక్కల కంటే పిల్లులను పెంచుకుంటే, ఎలుకల నియంత్రణ కూడా సాధ్యమవుతుందని పేర్కొంది. అదే సమయంలో, వీధి కుక్కల తొలగింపు విషయంలో ఉన్న నియమాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు, మున్సిపల్ సంస్థలు మరియు స్థానిక సంస్థలు ఏబీసీ (ABC) నియమాలను సమర్థంగా అమలు చేయడంలో విఫలమవుతున్నాయని వ్యాఖ్యానించింది.ఇదే సమయంలో, తెలంగాణలోని సంగారెడ్డిలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సంగారెడ్డిలో తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఒక బాలుడిపై డజనుకు పైగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో అతనికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.బాలుడి అరుపులు విని కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కలను తరిమివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వసంత్ రావు మాట్లాడుతూ, బాలుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.వైద్యులు బాలుడికి పెయిన్ కిల్లర్స్‌తో పాటు యాంటీబయాటిక్స్, ఇమ్యునోగ్లోబులిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులతో చికిత్స అందించినట్టు చెప్పారు. గురువారం రోజున ఆ బాలుడిని సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు వెల్లడించారు.