|
|
by Suryaa Desk | Sun, Jan 11, 2026, 05:28 PM
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలవ్వకముందే నాటుకోడి మాంసానికి గిరాకీ అమాంతం పెరిగింది. పండుగ రోజుల్లో నాటుకోడి వండుకోవడం ఒక సంప్రదాయంగా వస్తున్నందున.. మార్కెట్‌లో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది ఉత్పత్తి తగ్గడం, పెంపకం చేసే రైతుల సంఖ్య పరిమితంగా ఉండటంతో నాటుకోడి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి.
అందుతున్న సమాచారం ప్రకారం.. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో.. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో నాటుకోడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పందెం పుంజులు, మేలు రకం నాటుకోళ్ల ధర కేజీ రూ. 2,000 నుండి రూ. 2,500 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో పందాలకు ఉపయోగించే కోళ్లకు ఇంకా ఎక్కువ ధర లభిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పందెం కోళ్లను పెంచుతూ ఉంటారు. వీటి ధరలు రూ.లక్షల్లో ఉండటం గమనార్హం.
ఇక హైదరాబాద్ వంటి నగరాల్లోనూ కేజీ నాటుకోడి ధర రూ. 600 నుండి రూ. 1,000 వరకు విక్రయిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం మటన్ ధర కేజీ రూ. 800 నుండి రూ. 900 ఉండగా.. నాటుకోడి ధర దానిని కూడా దాటేసింది. ప్రస్తుతం గ్రామాల్లో నాటుకోళ్లు దొరకడమే కష్టంగా మారింది. పండుగ అవసరాల కోసం ప్రజలు నెల రోజుల ముందే గ్రామాల్లో ఆరా తీసి వీటిని బుక్ చేసుకుంటున్నారు. పందెం పుంజుల కంటే రుచి పరంగా పిట్టలకే ఎక్కువ గిరాకీ ఉంటోంది. అందుకే చాలా చోట్ల కోడి పిట్టల కొనుగోలుకు వినియోగదారులు పోటీ పడుతున్నారు. నాటుకోడి ధరలు చుక్కలు చూపిస్తున్నప్పటికీ.. సాధారణ బ్రాయిలర్ చికెన్ ధరలు మాత్రం కొంతవరకు స్థిరంగా ఉన్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, వరంగల్ వంటి నగరాల్లో స్కిన్‌లెస్ చికెన్ ధర కేజీ రూ. 300 నుండి రూ. 320 మధ్య కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో రూ. 260 నుండి రూ. 280 వరకు లభిస్తోంది. గతంలో ప్రతి ఇంట్లో నాటుకోళ్లు పెంచేవారు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం కొన్ని పౌల్ట్రీ ఫారాల్లో మాత్రమే నాటుకోళ్లను పెంచడం వల్ల సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది. పండుగ రోజున బ్రాయిలర్ చికెన్ కంటే నాటుకోడి తినడానికే జనం ఆసక్తి చూపడం వల్ల మున్ముందు ఈ ధరలు మరికొంత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.