|
|
by Suryaa Desk | Sun, Jan 11, 2026, 05:07 PM
హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు అక్రమ మార్గాల్లో గంజాయి విక్రయాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా బంజారాహిల్స్ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్న ఓ రాపిడో డ్రైవర్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు తన వృత్తిని అడ్డం పెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 పరిసరాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10, ఇబ్రహీంనగర్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ జునైద్ అనే వ్యక్తి రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ... రహస్యంగా గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడి వద్ద నుంచి 137 గ్రాముల ఎండు గంజాయితో పాటు, నేరానికి ఉపయోగించిన హోండా షైన్ మోటార్ సైకిల్, ఒక ఒప్పో మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్, గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల కాలంలో డెలివరీ ఏజెంట్లు లేదా క్యాబ్ డ్రైవర్ల ముసుగులో మాదకద్రవ్యాల రవాణా పెరుగుతోంది. వినియోగదారుల వద్దకు నేరుగా వెళ్లే అవకాశం ఉండటం, పోలీసులు తనిఖీ చేసినా వృత్తిపరమైన పనుల నిమిత్తం వెళ్తున్నట్లు నమ్మించడం వీరికి సులువుగా మారుతోంది.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లోని విద్యావంతులు, యువతను లక్ష్యంగా చేసుకుని ఈ చిన్న చిన్న ప్యాకెట్ల గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. పోలీసులు ఇప్పుడు ఇలాంటి చిన్న స్థాయి విక్రయదారుల (పెడ్లర్స్) వెనుక ఉన్న అసలు సప్లయర్స్ కోసం గాలిస్తున్నారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా జునైద్ ఎవరెవరికి గంజాయి విక్రయించాడు..?ఎక్కడి నుండి కొనుగోలు చేశాడు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.