ముక్కుసూటిగా మాట్లాడుతూ.. సొంత పార్టీ నాయకత్వాన్ని కూడా ఏమాత్రం భయపడకుండా బహిరంగంగానే కడిగేస్తూ.. నాయకులను మీడియా ముందే దులిపేస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. తరచూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. మరోసారి తన కోపాన్ని వెల్లగక్కారు. సొంత పార్టీ నాయకత్వాన్నే నిలదీశారు. ఏఐసీసీ నాయకులను నిలబెట్టి కడిగేశారు. ముఖ్యంగా.. ఏఐసీసీ కార్యదర్శి విష్ణుతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీప్‌దాస్ మున్షిపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అసలు.. తెలంగాణకే పని చేస్తున్నారా.. లేదా వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారా అంటూ ఏమాత్రం ఆశలేకుండా గాలి తీసేసినట్టు సమాచారం.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేసేలా కొందరు ఇంఛార్జులు పని చేస్తున్నారంటూ జగ్గారెడ్డి తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. అయితే.. నిన్న రాత్రి ఓ ఫంక్షన్‌కు హాజరైన జగ్గారెడ్డి.. అక్కడ ఏఐసీసీ కార్యదర్శి విష్ణుని కలవగా.. ఆయనను గట్టిగానే నిలదీసినట్టు సమాచారం. మెదక్ జిల్లా కూడా నేనే చూస్తున్నా అని చెప్పి ఎక్కడికి వెళ్లావని.. విష్ణును నిలదీసినట్టు తెలుస్తోంది. అసలు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా లేక వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారా అంటూ ప్రశ్నించినట్టు సమాచారం. రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ దీప్ దాస్ మున్షీ కూడా తెలంగాణకే పని చేస్తున్నారా లేక ఆమె కూడా వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారా అంటూ కోపాన్ని వెళ్లగక్కినట్టు తెలుస్తోంది.
"అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ ఎలా ఉండాలో మీకు తెలుసా.. అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతోందా..? అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయినట్టు సమాచారం. పార్టీలో కొందరికి పదవులు కట్టబెట్టటంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జగ్గారెడ్డి.. సీనియర్ నాయకులమైన తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కొత్త వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే విషయం.. ఫైనల్ అయ్యే వరకు తమకు సమాచారం ఇవ్వరా.. అంటూ ప్రశ్నించినట్టు సమాచారం. పార్టీ కోసం పనిచేసిన వారిని.. ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేసిన వారిని ఎవరు పట్టించుకోవాలని అడిగినట్టు తెలుస్తోంది.
కాగా.. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా సంచలంగా మారాయి. అటు పార్టీలోనూ సరికొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చాయి. అయితే.. జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇదేమీ మొదటిసారికాదు. గతంలోనూ చాలాసార్లు అధిష్ఠానంపై తన అసంతృప్తిని బహిరంగంగానే జగ్గారెడ్డి బయటపెట్టారు. అయితే.. ఇన్ని రోజులు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ, ఎండగడుతూ ఉండే జగ్గారెడ్డి ఈసారి.. ఏఐసీసీ నాయకులను నిలదీయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి.. జగ్గారెడ్డి వ్యవహారంపై కొత్త టీపీసీసీ అధ్యక్షుడు, సౌమ్యుడు.. మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.