అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి సభ్యుడు సభ విలువను కాపాడాలని, ప్రజాస్వామ్యయుతంగా చర్చకు రావాలన్నారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ప్రజాప్రతినిధుల శిక్షణా తరగతులు ముగిశాయి.అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ... ఈరోజుతో శిక్షణా తరగతులు ముగిశాయన్నారు. తెలంగాణ మూడో శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభా వ్యవహారాల శాఖ రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించిందన్నారు. శాసనసభ, మండలిలో సమర్థవంతంగా ప్రజల అంశాలు చర్చకు రావాలన్నారు.ప్రజల కోసం ఏం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయో అది నెరవేరే విధంగా సభ్యులంతా సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య విలువలకు శాసనసభ వేదిక అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.