హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మంచి డీల్స్ లేక రియల్టర్లు డల్ అయిపోయారు. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ నగరవాసులకు అద్దిరిపోయే డీల్ వచ్చింది. ఒక్కో గజానికి రూ.81 వేలంటా. అదేదో హైటెక్ సిటీనో.. కోకాపేట్ ప్రాంతంలో కాదండోయ్.. రద్దీగా ఉంటే పాతబస్తీలో. ప్రస్తుతం హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ పనులు ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. అందులోనూ పాతబస్తీ మెట్రోను ప్రారంభించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే.. పాతబస్తీ మెట్రో మార్గంలో భూసేకరణకు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. అధికారులు అదే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ మేరకు.. పాతబస్తీలో మెట్రో మార్గంలో రహదారి విస్తరణకు కూడా ఆస్తుల సేకరణను అధికారులు మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగానే.. ఆ మార్గంలోని ఆస్తులకు గానూ.. గజానికి రూ.81 వేలు పరిహారంగా ఇచ్చేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయించినట్టుగా.. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో కోసం, రహదారి విస్తరణ కోసం ముందుకొచ్చే నిర్వాసితులకు త్వరలోనే పరిహారం కింద చెక్కులు కూడా అందజేయనున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ ప్రక్రియ ఎంత త్వరగా పూర్తయితే.. అంతే త్వరగా ఆస్తుల కూల్చివేత, రహదారి విస్తరణ పనుల ప్రక్రియ మొదలుపెడతామని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
ఇప్పటికే కొందరు యజమానులు తమ అంగీకార పత్రాలను సమర్పించారని.. వారికి 10 రోజుల్లోగా చెక్కులు అందించనున్నట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరణ కోసం 1100 ఆస్తులను సేకరించాల్సి ఉందని పేర్కొన్నారు. మెట్రో రైలు రెండో దశలో భాగంగా.. 76.4 కిలో మీటర్ల మార్గానికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపించామని.. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు మొదలు పెడతామని వెల్లడించారు. మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడిస్తారని వివరించారు.
మరోవైపు.. మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఎల్ అండ్ టీ మరో కీలక ముందడుగు వేసింది. ప్రత్యేక ధరలతో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ సేవలు అందించేందుకు హైదరాబాద్ మెట్రో రైలుతో ర్యాపిడో కాంట్రాక్ట్ చేసుకుంది. శనివారం (డిసెంబర్ 21న) గ్రీన్ ల్యాండ్స్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. నగర అవసరాలను తీర్చడంలో ప్రజా రవాణాతో పాటూ గుమ్మం నుంచి గమ్యం దాకా సేవలు చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ర్యాపిడో, స్విధ, టీఎస్ ఆర్టీసీ, ఇతర మొబిలిటీ సంస్థల ద్వారా లక్ష మంది గుమ్మం నుంచి గమ్యం దాకా సేవలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ర్యాపిడో ఒక్క సంస్థే నిత్యం 45 వేల రైడ్‌లు చేస్తోందని.. ఈ సంఖ్య 2 లక్షలకు పెంచాలని, మహిళల కోసం ఉమెన్ రైడర్లు ఎక్కువ మందిని నియమించామని నిర్వాహకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa