ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సత్తా చాటిన బీఆర్ఎస్ సోషల్ మీడియా.. సల్లబడ్డ కాంగ్రెస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 07:12 PM

సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ బలం పెంచుకొని సత్తా చాటినట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఏమాత్రం అప్రమత్తంగా లేదనిపిస్తోంది. ఇంతకూ విషయం ఏంటంటే.. "తెలంగాణలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు..?" అనే ప్రశ్నతో కాంగ్రెస్ పార్టీ.. జనవరి 29న సాయంత్రం 4 గంటల 11 నిమిషాలకు ఎక్స్‌లో ఓ పోల్ పెట్టింది. ఈ ప్రశ్నకు A. ఫామ్ హౌస్ పాలన, B. ప్రజల వద్దకు పాలన.. అనే రెండు ఆప్షన్లు పెట్టింది. ఈ పోల్‌లో ఊహించని ఫలితాలు వచ్చాయి. 24 గంటల్లో పోల్ ముగిసే సమయానికి 92,551 ఓట్లు పోలవగా.. ఫామ్ హౌస్ పాలనకే ఎక్కువ ఓట్లు పడ్డాయి.


ఫామ్ హౌస్ పాలనకు ఏకంగా 67 శాతం ఓట్లు పడగా.. ప్రజల వద్దకు పాలనకు 33 శాతం మంది మాత్రమే మద్దతుగా నిలవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా.. ఈ పోల్‌ ముగిసే సమయానికి 862 మంది కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలు తెలియజేయగా.. ఈ పోస్టును 1100 మంది రీపోస్ట్ చేశారు. 1400 మంది లైకులు కొట్టారు. అయితే కామెంట్లు పెట్టింది, రీపోస్ట్ చేసింది చాలా వరకు బీఆర్ఎస్ మద్దతుదారులే కావడం ఇక్కడ గమనార్హం.


కామెంట్స్ జత చేసి రీట్వీట్ చేసిన పోస్టులు (కోట్ రీపోస్ట్‌లు) చూస్తే.. ప్రభుత్వానికి మద్దతుగా చేసిన పోస్టు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించలేదు. దీన్ని బట్టి ప్రజలు ఈ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని జనాలు అనుకోవచ్చు. కానీ ఆ పోస్టులను జాగ్రత్తగా గమనిస్తే.. ఇదంతా చేసింది బీఆర్ఎస్ మద్దతుదారులే.


ఈ పోల్‌ రిజల్ట్ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో.. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నూటికి నూరుపాళ్లు విజయవంతమైంది. ఫామ్ హౌస్ పాలనేంటని ఒక్క కామెంటూ రాలేదంటే ఇది గులాబోళ్ల పని అని కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయొచ్చు గాక.. గీ పనికి కోట్లు ఖర్చుపెట్టుడు అవసరమా అని ప్రశ్నించొచ్చు గాక.. కానీ తన పోల్‌కు పాజిటివ్ లేదా న్యూట్రల్ రిజల్ట్ వచ్చేలా చూసుకునే విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఘోరంగా ఫెయిల్ అయ్యింది.


ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చూపిన దూకుడు అంతా ఇంతా కాదు. అసలు కాంగ్రెస్‌కు గెలిచే సీనే లేదు అని గులాబీ నాయకత్వం ప్రచారం చేస్తున్న టైంలో.. నాటి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ పెద్దల తప్పిదాలను జనాలకు చేరువ చేయడమే కాదు.. వాటిని జనం నమ్మేలా చేయడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం సూపర్ సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన పథకాలకు సంబంధించిన ప్రచారం కంటే.. బీఆర్ఎస్ సర్కారుపై ఎక్కుబెట్టిన విమర్శలు, చేసిన ఆరోపణలు, వేసిన సెటైర్లు అద్భుతంగా పేలాయి.


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మొదటి కారణం రేవంత్ రెడ్డి అయితే.. రెండోది ఆకర్షణీయమైన హామీలైతే.. మూడో కారణం మాత్రం కచ్చితంగా సోషల్ మీడియా ప్రచారమే అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమ పార్టీని ప్రమోట్ చేసుకోవటం కంటే ఎక్కువగా.. జనాల్లో బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం విజయవంతమైంది.


కేసీఆర్‌ను పోలిన వ్యక్తులతో రకరకాల ప్రకటనలు షూట్ చేపించి జోరుగా ప్రచారం చేసి.. గ్రామాల్లో అంతే జోరుగా తిరిగిన కారు టైర్లలో గాలి తీసేశారు. అంతేకాకుండా.. గులాబీ పార్టీకి మాంచి మైలేజ్ ఇచ్చిన గులాబీ జెండాలే రామక్క పాటను పేరడీ చేసి.. వాళ్ల చేతితో వాళ్ల కంటిని పొడిచినంత పని చేసింది. అయితే.. ఇదంతా సునీల్ కనుగోలు టీం నాయకత్వంలో రెట్టింపు ఉత్సాహంగా పని చేసిన సోషల్ మీడియా టీం కృషే అని చెబుతుంటారు.


అలాంటి కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం.. తమ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఎవరి పాలన బాగుందనే కీలకమైన పోల్ పెట్టినప్పుడు.. ఏమాత్రం యాక్టివ్‌గా స్పందించకపోవడం.. విపరీతంగా నెగిటివ్ కామెంట్లు వస్తున్నా.. పోల్ ప్రారంభం నుంచి చివరి వరకూ వ్యతిరేకంగానే ట్రెండ్ కనిపించినప్పటికీ.. రంగంలోకి దిగి డ్యామేజ్ కంట్రోల్‌కు ప్రయత్నించినట్లు కనిపించకపోవడం సీఎం నుంచి సగటు కాంగ్రెస్ కార్యకర్త వరకు అందర్నీ ఆశ్చర్యపరిచేదే.


మరోవైపు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్‌కు తత్వం బోధపడిందనిపిస్తోంది. తాము ఎక్కడ బలహీనంగా ఉన్నామో అర్థం చేసుకొని.. సోషల్ మీడియాపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. దీంతో ఏ చిన్న సందు దొరికినా.. అసలు అవకాశం లేకున్నా కల్పించుకొని మరీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. గత ఏడాది ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఇంత బేలగా కనిపించడం.. సల్లబడినట్లు ఉండటం ఇదే తొలిసారి.


సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి సంధించిన అస్త్రాన్ని తిప్పికొట్టడంలో గులాబీ సోషల్ దళం విజయం సాధించగా.. కాంగ్రెస్ మాత్రం చేజేతులా సెల్ఫ్ గోల్ చేసుకుంది. హామీల అమలు కావచ్చు.. సోషల్ మీడియాలో మళ్లీ దూకుడు చూపే విషయంలోనైనా కావచ్చు.. ప్రత్యర్థిని కాచుకునే విషయంలోనైనా కావచ్చు.. ఇక మీదటైనా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉంటుందేమో చూడాలి. లేదంటే గులాబీ దళం జోరును మరింత పెంచే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa