ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెలుగులోకి లేడీ అఘోరీ అసలు భాగోతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 07:56 PM

సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ దేవాలయాల్లో మసీదుల కూల్చివేత అంటూ.. గతకొంతకాలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీ.. మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తొలుత.. దిగంబరురాలిగా తెలంగాణలోని పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన లేడీ అఘోరీ.. ఆ తర్వాత సోషల్ మీడియాల్లో ఇంటర్వ్యూలతో టాక్ ఆఫ్‌ ది తెలుగు స్టేట్స్‌గా మారిపోయారు. ఆ తర్వాత.. ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే సమయంలో బట్టలు వేసుకుని రావాలని కోరితే ససేమిరా అంటూ రోడ్ల మీద రచ్చ చేసి.. వార్తల్లో నిలిచారు. మధ్య మధ్యలో అజ్ఞాతంలోకి వెళ్తూ.. అందరూ మర్చిపోయే సమయంలో మళ్లీ ప్రత్యక్షమవుతూ.. మసీదులను కూల్చేవేస్తాను, అడ్డొచ్చిన వాళ్లను అడ్డంగా నరికేస్తాను, సనాతన ధర్మాన్ని రక్షిస్తానంటూ సంచలన స్టేట్‌మెంట్లు ఇస్తూ పోలీసులకు కొరకరాని కొయ్యగా మారారు.


మొదట్లో.. ఆమెను చూసి జనాలు లేడీ అఘోరిగానే భావించారు. కానీ ఆమె చేష్టలు చూసి కొంతమంది ఔత్సాహికులు.. తన బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆమె అఘోరీనే కాదని కొంతమంది.. అసలు ఆమె ఆమెనే కాదు అతడు అని.. అతని పేరు అల్లూరి శ్రీనివాస్ అంటూ మరికొంత మంది.. ఇలా రకరకాల ఆరోపణలు గుప్పించారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా.. ఎన్నిసార్లు పోలీసులు అడ్డుకున్నా.. కారుతో సహా ఆమెను గాల్లోకి ఎత్తేసి పోలీస్ స్టేషన్లకు తరలించినా.. ఆమె మాత్రం తగ్గేదేలే అంటూ తనదైన తీరుతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.


ఇదే క్రమంలో.. ఈ అఘోరీ ఓ కాలేజీ విద్యార్థినితో దర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని రోజులు ఆమె ఇంట్లో ఉండి.. ఆమెను వశపర్చుకుందంటూ ఆరోపణలు రాగా.. అదేమీ లేదు తానకు అఘోరీ మాత ఇష్టమంటూ ఆ యువతి చేసిన వ్యాఖ్యలు అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఈ జంటకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో.. అఘోరీ విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.


ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అఘోరీపై తాజాగా ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. తాను అల్లూరి శ్రీనివాస్‌ను జనవరి 1న వివాహం చేసుకున్నానని.. అయితే కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఆయన వర్షిణి అనే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడంటూ ఫ్యూజులవుటయ్యే ఆరోపణలు చేసింది.


తాజాగా.. మీడియా ముందుకు వచ్చిన యువతి.. తాను ఉండగానే మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారంటూ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను ప్రశ్నించింది. అఘోరీ ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడోనని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం ఇక్కడితో ముగియాలని.. అందుకే తాను ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నానని స్పష్టం చేసింది. అఘోరీపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ, తెలంగాణ ప్రభుత్వానికి సదరు యువతి విజ్ఞప్తి చేసింది.


ఇదే క్రమంలో వారి పరిచయం గురించి వివరిస్తూ.. తొలుత భక్తితోనే అఘోరీని కలిశానని, ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి వివాహానికి దారితీసిందని యువతి తెలిపింది. తామిద్దరూ కలిసి ఒక ఆశ్రమం స్థాపించి సేవ చేయాలని కలలు కన్నామని.. కానీ అఘోరీ తన మాటపై నిలబడకపోవడంతో అది సాధ్యపడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వర్షిణి విషయం బయటపడగా.. ఆమె గురించి ప్రశ్నిస్తే వర్షిణి తన కూతురని, తానే ఆమెకు గురువునని అఘోరీ చెప్పినట్టు పేర్కొంది. ఈ యువతి ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా దుమారం రేపుతున్నాయి.


ఈ తాజా ఆరోపణలు లేడీ అఘోరీ చుట్టూ ఉన్న వివాదాలను మరింత ముదిరేలా చేశాయి. ఈ విషయంపై పోలీసులు ఎలా స్పందిస్తారు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదో వేచి చూడాల్సి ఉంది. అయితే, ఈ ఘటన మాత్రం లేడీ అఘోరీ వ్యవహారంలో మరో కీలక మలుపుగా పరిణమించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa