టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా అభిమానులకు బ్యాడ్‌న్యూస్. గాయం కారణంగా ప్రపంచకప్ 2023 నుంచి మధ్యలో నిష్క్రమించిన హార్దిక్ పాండ్యా త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు కూడా దూరం కానున్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. చీలమండకు బలమైన గాయం కావడంతో అతడి స్థానంలో మొహమ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. చీలమండకు అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు మరో 2 నెలలు పట్టవచ్చని సమాచారం. అందుకే ఈ ప్రపంచకప్ తరువాత ఇండియాలో జరగనున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు కూడా హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండడని తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2023 నవంబర్ 23న విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. ఆ తరువాత నవంబర్ 26న తిరువనంతపురం, నవంబర్ 28న గౌహతి, డిసెంబర్ 1న నాగపూర్, డిసెంబర్ 3న హైదరాబాద్‌లో వరుస టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసిన తరువాత దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 10, 12, 14 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. తరువాత 2 టెస్ట్ మ్యాచ్‌లు 3 వన్డేలు జరగనున్నాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆ దేశంలోనే జరగనుంది. హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులోకి చేరిన మొహమ్మద్ షమీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రదర్శన ఇచ్చాడో అందరికీ తెలుసు. ఆడిన 6 మ్యాచ్‌లలో మూడు సార్లు ఐదు వికెట్లు తీశాడు. మొత్తం 23 వికెట్లు తీసి టాప్‌లో నిలిచాడు. న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌లో అయితే 7 వికెట్లు తీసి టీమ్ ఇండియాను ఫైనల్‌కు చేర్చాడు.