వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్.. నాలుగు రోజుల వ్యవధిలోనే మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో తలపడనుంది. నేడు విశాఖపట్నం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు కూడా విశాఖ చేరి ప్రాక్టీస్ మొదలెట్టాయి. అయితే భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే తొలి మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉంది. విశాఖ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆక్యూ వెదర్ ప్రకారం.. నగరంలో దాదాపు 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండనుంది. అంతే కాకుండా గాలిలో తేమ శాతం 63గా ఉంది. వర్షం కురిసేందుకు 60 శాతం అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
మధ్యాహ్నంతో పోలిస్తే మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం తగ్గే అవకాశం ఉంది. కానీ చిరు జల్లులు పడే అవకాశం ఉంది. దీంతో వర్షం కారణంగా టాస్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం లేనప్పటికీ.. కొంత మేర మాత్రం ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో విశాఖ వాసులు, టికెట్లు కొని స్టేడియానికి వెళ్తున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు విశాఖ వేదికగా భారత్.. మూడు టీ20 మ్యాచుల ఆడింది. అందులో 2016లో శ్రీలంకపై, 2022లో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. అయితే 2019లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. కాగా ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం సూర్యకుమార్ సారథ్యంలో కుర్రాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. దీంతో భారత తుది జట్టు ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.