ఐపీఎల్ 16వ సీజన్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆరో ట్రోఫీ కోసం కసరత్తు మొదలెట్టింది. ఐపీఎల్ 2024 మినీ వేలానికి కౌంట్‌డౌన్ మొదలవ్వడంతో కొందరు ఆటగాళ్లను విడుదల చేసింది. ఆదివారం దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్‌ను సీఎస్కే రిలీజ్ చేసింది. దాంతో, సీఎస్కేతో అనుబంధం ముగిసినందున ప్రిటోరియస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపాడు.
‘థాంక్యూ సీఎస్కే. ఈ ప్రయాణం చాలా గొప్పది. సీఎస్కేతో నేను కొనసాగిన కాలం నిజంగా అద్భుతం. చెన్నై మేనేజ్‌మెంట్, కోచ్‌లు, ఆటగాళ్లు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2024 సీజన్‌కు ఆల్ ది బెస్ట్’ అని ప్రిటోరియస్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఈ పొడగరి ఆల్‌రౌండర్ 16వ సీజన్‌లో ఆడిన 7 మ్యాచుల్లో 6 వికెట్లు తీశాడంతే. ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ కూడా 17వ సీజన్ నుంచి తప్పుకోవడంతో చెన్నై నిఖార్సైన ఆల్‌రౌండర్ వేటలో ఉంది.