ప్రస్తుతం ఉన్నత విద్య కోసం కళాశాలల్లో చేరే సీజన్ మొదలైంది. కొంత మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటారు. మరికొందరు ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరతారు. అయితే, పెరుగుతున్న ఫీజుల భారాన్ని సొంతంగా భరించడం సామాన్య కుటుంబాలకు శక్తికి మించిన పనే అని చెప్పాలి. అలాంటి వారు బ్యాంకుల్లో విద్యా రుణాలు తీసుకోవచ్చు. ప్రతి ఏడాది విద్యా ద్రవ్యోల్బణం 10-12 శాతంపైనే ఉంటోంది. విద్యా రుణం అందజేసేటప్పుడు మీరు చేరే కాలేజీ, కోర్సు వివరాలు, విద్యకు అయ్యే మొత్తం ఖర్చులు, అకాడమిక్ రికార్డ్స్, కుటుంబ ఆదాయం, ఆస్తులు మొదలైన వివరాలను బ్యాంకులు చెక్ చేస్తాయి. అర్హత గల రుణ గ్రహీతలకు కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విద్యా రుణం..
దేశీయ అతిపెద్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్స్ అందిస్తోంది. అన్ని వివరాలు సరిగా ఉండి, పూర్తి అర్హతలు ఉన్న వారికి 8.15 శాతానికే విద్యా రుణాలు ఇస్తోంది. ఈ బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్స్ పై కనిష్ఠ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉండగా గరిష్ఠంగా 11.75 శాతంగా ఉంది. ఇతర పెద్ద పెద్ద బ్యాంకులతో పోలిస్తే ఇది తక్కువే అని చెప్పవచ్చు.
రూ.10 లక్షల విద్యా రుణానికి ఈఎంఐ ఎంత కట్టాలి?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు కనీస వడ్డీ రేటు 8.15 శాతంతో రూ. 10 లక్షల ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. మీరు తిరిగి చెల్లించే కాల వ్యవధి 5 సంవత్సరాలుగా నిర్ణయించుకున్నారు అనుకుందాం. ఈ వివరాలతో మీరు ఆన్‌లైన్‌లో లభించే స్టూడెంట్ లోన్ కాలిక్యులేటర్ ద్వారా ఎంత ఈఎంఐ పడుతుందో తెలుసుకోవచ్చు. రీపేమెంట్ టెన్యూర్ పెరిగితే ఈఎంఐ తగ్గుతుంది. ఈఎంఐ పెంచుకుంటే టెన్యూర్ తగ్గుతుంది.
ఈ లెక్కన మీరు రూ.10 లక్షల ఎడ్యుకేషన్ లోన్ 8.15 శాతం వడ్డీతో తీసుకున్నారు అనుకుంటే 5 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే మీరు నెలకు రూ. 20,370 వరకు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. మీరు 5 ఏళ్లలో రూ. 2, 22,330 వరకు వడ్డీ కట్టాలి. అంటే అసలు రూ. 10 లక్షలు, వడ్డీ కలుపుకొని రూ. 12, 22, 330 వరకు బ్యాంకుకు చెల్లించాల్సి వస్తుంది. అదే మీరు లోన్ రీపేమెంట్ టెన్యూర్ 7 ఏళ్లు ఎంచుకున్నారు అనుకుందాం. అప్పుడు మీరు నెలకు రూ. 15,680 వరకు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అలాగే 10 ఏళ్లు ఎంచుకుంటే నెలకు రూ. 12, 240 వరకు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది.