గత వారంలో హైదరాబాద్‌లోనూ ఎడతెరిపిలేకుండా వర్షాలు పడ్డాయి. గత రెండు మూడు రోజుల నుంచే కాస్త తగ్గాయి. అయితే, భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుంటుంది. నగరంలో ఇలాంటి పరిస్థితులు తరుచుగా ఎదరవుతుంటాయి. భవనాల్లోని బేస్ మెంట్ లోకి వరద నీరు చేరి అందులో పార్క్ చేసిన కార్లు, ఇతర వాహనాలు దెబ్బతింటుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాహన బీమా రక్షణ ఇస్తుంది. వరద నీటితో ఏర్పడిన నష్టానికి పరిహారం చేల్లిస్తుంది. కనీ, వాహనదారులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల బీమా క్లెయిమ్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరి వరద నీరు కారు ఇంజిన్‌లోకి చేరినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది తెలుసుకుందాం.
కారు వరదలో చిక్కుకున్నప్పుడు లేదా కారు ఇంజిన్‌లోకి వరద నీరు చేరినప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఇలా చేస్తే కారు ఇంజిన్ పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్ తిరస్కరించవచ్చు. నీటిలో చిక్కుకున్న కారుకు సంబంధించిన అన్ని ఫోటోలు తీసు జాగ్రత్త చేసుకోవాలి. కారులో వరద నీరు చేసిన వెంటనే ఆ సమాచారాన్ని సదరు బీమా కంపెనీకి అందించాలి. ప్రస్తుతం అన్ని కంపెనీలు వాట్సాప్ ద్వారానే సమాచారం స్వీకరిస్తున్నాయి. సంబంధిత ఫోటోలు, ఆధారాలు అప్పుడే పంపించాలి.
బీమా సంస్థ కస్టమర్ సర్వీస్ సెంటర్ ఫోన్ లేదా ఇ- మెయిల్ ద్వారా సంప్రదించి జరిగిన విషయాన్ని తెలపాలి. మీరు క్లెయిమ్ చేసినప్పటి నుంచి ప్రతి అంశాన్ని నమోదు చేసుకోవాలి. మీరు సమాచారం ఇచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ సంస్థ నుంచి ఒక సర్వేయర్ వస్తారు. ఆ సర్వేయర్ వచ్చినప్పుడు అడిగిన సమాచారం అందించాలి. దీంతో జరిగిన నష్టాన్ని సరిగా అంచనా వేసి కంపెనీకి నివేదించే వీలు కలుగుతుంది. కొన్ని సార్లు ఇన్సూరెన్స్ కంపెనీ ఎఫ్ఐఆర్ అడుగుతాయి. ముఖ్యంగా వాహనం వరదలో కొట్టుకుపోయినప్పుడు ఎఫ్ఐఆర్ అవసరమవుతుంది.
కొన్ని సార్లు ప్రాథమిక వాహన బీమా ప్లాన్ల ద్వారా వరదల వల్ల జరిగిన నష్టానికి పూర్తి స్థాయిలో నష్ట పరిహారం ఇవ్వకపోవచ్చు. అలాంటి పాలసీలు తీసుకున్న వారు వర్షా కాలంలో అనుబంధ రైడర్ పాలసీ తీసుకోవడం మంచిది. అందులోకారు ఇంజిన్ ప్రొటక్షన్ కవర్, రిటర్న్ టూ ఇన్వాయిస్ రైడర్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ రైడర్ వంటి ఫీచర్లు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వరదల్లో కారు చిక్కుకుపోయినా నష్టపోకుండా ఉండవచ్చు.