జులై 31వ తేదీ నాటికి ఏకంగా 7.28 కోట్ల మంది తమ ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. ఇప్పుడు వారంతా తమ రీఫండ్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, అందులో చాలా మందికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుతున్నాయి. రీఫండ్ వస్తుందనుకుంటే నోటీసులు వస్తుండడంతో అవాక్కవుతున్నారు. నోటీసులు వచ్చేందుకు చాలా కారణాలు ఉంటాయి. ప్రస్తుతం చాలా మందికి ఆదాయపు పన్ను శాఖ డిఫెక్టివ్ రిటర్న్ నోటీసులు పంపిస్తోంది. అసలు ఈ నోటీసులు ఎందుకు ఇస్తారు? వస్తే ఏం చేయాలి? అనే విషయాలు తెలుసుకుందాం.
ఐటీ రిటర్నులు ఫైల్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని పన్ను నిపుణులు చెబుతుంటారు. ఆదాయపు పన్ను శాఖ సైతం ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ ఆదాయానికి ఆధారమైన ఫారం 26 AS, వార్షిక సమాచార నివేదిక లో ఉన్న ఆదాయానికి, ఐటీఆర్‌లో నమోదు చేసిన ఆదాయానికి మధ్య తేడాలు ఉంటుండడం గమనార్హం. ఇలా ఐటీఆర్‌లో పేర్కొన్న సమాచారంలో తేడాలు ఉన్నట్లు గుర్తించిన క్రమంలోనే ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం డిఫెక్టివ్ రిటర్న్స్ నోటీసులు పంపిస్తోంది. అలాగే వ్యాపారం, కమీషన్ల ద్వారా వచ్చిన ఆదాయం ఉంటే ఇతర ఆదాయాలుగా చూపించినప్పుడు, షేర్ల విక్రయం, ఇతర మార్గాల్లో వచ్చిన క్యాపిటల్ గెయిన్స్‌ను నమోదు చేయకపోడవం, ఐటీఆర్ ఫారం 2 ఎంచుకోవాల్సిన వారు ఐటీఆర్ 1 దాఖలు చేయడం వంటివి జరిగినప్పుడు సెక్షన్ 139 (9) ప్రకారం డిఫెక్టివ్ నోటీసులు పంపిస్తుంది ఐటీ శాఖ.
నోటీసు వస్తే ఏం చేయాలి?
ఐటీ నోటీసులు రాగానే కంగారుపడిపోకూడదు. ముందుగా ఆ నోటీసు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. డిఫెక్టివ్ రిటర్న్స్ నోటీసులు అయితే, మీ ఆదాయంలో తేడాలు ఉన్నాయి సరిచేయండి, ఫారం ఎంపికలో పొరపాటు చేశారు సరైన పత్రాన్ని ఎంచుకోండి, తగిన ఆధారాలతో రిటర్నులను తిరిగి దాఖలు చేయండి అని చెబుతుంది ఐటీ శాఖ. కొన్నిసార్లు సమాధానం ఇస్తే సరిపోతుంది. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్‌కు సంబంధించి పారం 26ఏఎస్ లో పేర్కొన్న ఆదాయానికి, ఐటీఆర్‌లో పేర్కొన్న మొత్తానికి తేడా ఉంటే రిటర్నులు ప్రాసెసింగ్‌లో ఇబ్బందులు వస్తాయి. అలాంటి సందర్భంలో సరైన వివరాలతో రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫారం 26ఏఎస్‌లో పూర్తి వివరాలు లేని సందర్భంలో టీడీఎస్ కట్ చేసిన వారిని సంప్రదించాలి. డిఫెక్టివ్ నోటీసు వచ్చిన 15 రోజుల్లోగా దానికి సమాధానం ఇవ్వాలి. లేకుంటే మీకు రిఫండ్ రాకపోవడమే కాదు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది.