రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మహిళా కార్యదర్శులు విధి నిర్వహణలో స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. వారికి జాబ్ చార్ట్‌పై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, మాధవి రెడ్డి కోరారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు.
గత ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్య వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. గ్రామ మహిళా కార్యదర్శులకు పోలీస్ డ్రెస్ ఇవ్వాలని వైసీపీ వాళ్ళు చూశారని తెలిపారు. ఎన్‌బీడబ్ల్యూలను ఇంప్లిమెంట్ చేయాలని మహిళా కార్యదర్శులను పంపారన్నారు. వీళ్ళకు నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల పోలీస్ డ్యూటీలు ఇచ్చారని.. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు.