తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. కొంతమంది కాలినడకన తిరుమలకు చేరుకుంటే.. మరికొంతమంది భక్తులు వాహనాల్లో తిరుమల కొండకు చేరుకుంటారు. ఇక శ్రీవారి దర్శనం కూడా పలు రకాలు. సర్వ దర్శనం, దివ్య దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇలా పలు రకాలు. అయితే సామాన్యులు ఎక్కువగా సర్వదర్శనానికే ప్రాధాన్యమిస్తుంటారు. అయితే రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సర్వ దర్శనానికి వెళ్లే భక్తులు గంటల తరబడి కంపార్ట్‌మెంట్లలో వేచి చూడాల్సి ఉంటుంది. పండుగ రోజుల్లో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. క్యూలైన్లు దాటి, కంపార్టుమెంట్లు చేరి.. గంటల తరబడి అక్కడే ఉండాల్సి ఉంటుంది.
అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేలా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా వెంకటేశ్వరస్వామి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకోనున్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనభాగ్యం కల్పించే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురానున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్ట్యువల్ క్యూ ఏర్పాటు చేస్తామని.. రెండు, మూడు గంటల్లో వారికి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు,
మరోవైపు తిరుపతి పట్టణవాసులకు టీటీడీ శుభవార్త వినిపించింది. స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అలాగే తిరుపతిలోని శ్రీనివాసు సేతు ఫ్లైఓవర్ పేరును కూడా మార్చినట్లు చెప్పారు.
శ్రీనివాస సేతు పేరును గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. అలాగే తిరుమల డంపింగ్ యార్డ్‌లోని చెత్తను మూడు నెలల్లో తొలగిస్తామని టీటీడీ చైర్మన్ చెప్పారు. టూరిజానికి కేటాయించే 4 వేల దర్శన టికెట్లను రద్దు చేస్తున్నామన్న టీటీడీ ఛైర్మన్.. కొత్తగా కడుతున్న ముంతాజ్ హోటల్ అనుమతులు కూడా రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు.