అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాద ఘటన జరిగింది. తెల్లవారితే నిశ్చితార్థం.. ఇంతలో నవ వధువు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వెంకటరెడ్డిపల్లికి చెందిన శ్రీరామిరెడ్డి, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.. వీరిలో పెద్ద కూతురు గీతావాణికి పెళ్లి కుదిరింది.. తాడిపత్రిలోని నంద్యాల రోడ్డులో ఉన్న ఎస్ఎల్‌వీ ఫంక్షన్ హాలులో ఆదివారం నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.
వధువు గీతావాణి తన తమ్ముడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై తాడిపత్రి వెళ్లారు. అక్కడ పనులు చక్కబెట్టుకుని రాత్రి 8.30 గంటల సమయంలో తిరిగి సొంత ఊరికి బయల్దేరారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా నాపరాయి బండల లోడుతో తాడిపత్రికి వస్తున్న ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ గీతావాణిపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆమె తమ్ముడు నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడగా.. వెంటనే అనంతపురం తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
శ్రీరామిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ ముగ్గురు పిల్లల్ని కష్టపడి చదివించారు. కూతుళ్లు గీతావాణి, బిందు బాగా చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. కుమారుడు నారాయణ రెడ్డి బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నారు. గీతావాణికి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో పెళ్లి కుదిరింది.. నిశ్చితార్ధానికి రెండు కుటుంబాలు సిద్ధమైన సమయంలో ఈ విషాదం జరిగింది. ఈ ఘటనతో శ్రీరామిరెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.. ఆ ఊరిలో కూడా విషాదం అలముకుంది.
బాలికల్ని రక్షించిన తల్లి
అనంతపురం జిల్లా వేదవతి హగరిలో దుస్తులు ఉతికేందుకు వెళ్లిన ఇద్దరు బాలికలు నీటిలో మునిగిపోగా.. తల్లి అప్రమత్తమై ఇద్దరిని కాపాడింది. గుమ్మఘట్ట మండలంలోని కలుగోడుకు చెందిన హనుమంతు, శ్రుతి దంపతులకు సంగీత, పవిత్ర, ఒక కుమారుడు ఉన్నారు. ఆదివారం స్కూల్‌కు సెలవు కావటంతో ఇద్దరు బాలికలు తల్లితో కలిసి దుస్తులు ఉతికేందుకు ఊరికి పక్కనే ఉన్న వేదవతి హగరికి వెళ్లారు. అక్కడ ఇద్దరు బాలికలు నీటిలో దిగి సరదాగా స్నానం చేస్తుండగా.. ఓ గుంతలోకి వెళ్లిపోయారు. లోతు గుంత కావడంతో కేకలు వేయగ.. అక్కడే ఉన్న శ్రుతి ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చింది. బాలికలను 108 వాహనంలో రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.