ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత గ్యాస్ కోసం ఊహించని రెస్పాన్స్.. లక్షల్లో బుకింగ్స్.. ఇప్పటి వరకూ ఎన్నంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2024, 08:01 PM

ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అద్భుతమైన స్పందన వస్తోంది. దీపావళి కానుకగా సీఎం నారా చంద్రబాబు నాయుడు దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం ఏడాదికి మూడు సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అక్టోబర్ 31వ తేదీన ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన నాటి నుంచి ఈ పథకానికి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 40 లక్షల మంది వినియోగదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వివరాలను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీ శాసనమండలిలో వెల్లడించారు.


ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకంపై శాసనమండలిలో సోమవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు కొనసాగాయి. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ విషయంలో పదేపదే ప్రశ్నలు వేశారు. దీంతో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం వివరాలను మండలిలో వివరించారు. అయినప్పటికీ మంత్రి సమాధానంతో సంతృప్తి చెందిన బొత్స సత్యనారాయణ మరిన్ని ప్రశ్నలు గుప్పించారు. ఇక బొత్స వ్యాఖ్యలకు మంత్రి నాదెండ్లతో పాటుగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా కౌంటరిచ్చారు. టీడీపీ కూటమి సర్కారు ఇంత అద్భుతమైన కార్యక్రమం అమలు చేస్తున్నందుకు వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.


మరోవైపు దీపం 2.0 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఇప్పటి వరకూ రాష్ట్రంలోని 40 లక్షల మంది బుకింగ్ చేసుకున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. వీరిలో 30 లక్షల మందికి ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ అందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయన్న నాదెండ్ల మనోహర్.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి సిలిండర్ కోసం మార్చి 31, 2025 వరకు బుకింగ్ చేసుకోవచ్చని.. ఇందుకు నిధులు కూడా కేటాయించిన సంగతిని గుర్తు చేశారు. మరోవైపు తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుని ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తోంది. ఏడాదికి మూడు సిలిండర్లకు నాలుగు నెలలకు ఒకటి చొప్పున అందజేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com