రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొంతకాలంగా హడావిడి చేస్తున్న అఘోరీ సోమవారం మంగళగిరిలో హంగామా చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ జాతీయ రహదారిపై హల్‌చల్ చేశారు. మంగళగిరి బైపాస్ రోడ్డుపై బైఠాయించిన అఘోరీ.. పవన్ కళ్యాణ్ కలవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అఘోరీకి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మంగళగిరి జనసేన కార్యాలయంలో లేరు. ఇదే విషయాన్ని అఘోరీకి చెప్పిన పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే అఘోరీ వారి మాట వినలేదు. పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ భీష్మించుకుని కూర్చున్నారు. అక్కడే జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ మరింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదే సమయంలో పోలీసులపై అఘోరీ మాత దురుసుగా ప్రవర్తించారు. వారిపై దాడి చేస్తూ నెట్టేసే ప్రయత్నం చేసారు. వాహనాల రాకపోకలు ఆటంకం కలుగుతుందంటూ ఆమెను అక్కడ నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్తానంటూ అఘోరీ భీష్మించుకున్నారు. దీంతో రహదారిపై ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు చేసేదేమీ లేకపోవటంతో చివరకు అఘోరీని తాళ్లతో బంధించారు. మహిళా పోలీసుల సాయంతో అఘోరీని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు అఘోరీ ప్రతిరోజూ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను సందర్శిస్తున్న అఘోరీ.. పలుచోట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వార్తల్లో ఉంటున్నారు. సోమవారం మంగళగిరిలో కూడా ఇదే జరిగింది. తాను కార్ సర్వీసింగ్ కోసం వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారంటూ అఘోరీ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగుతుందంటూ నచ్చజెప్పేందుకు వచ్చిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. తక్షణమే పవన్ కళ్యాణ్ రావాలంటూ రోడ్డుపై బైఠాయించారు. రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటేశ్వరావు పై దాడి చేశారు. అఘోరీ ప్రవర్తనపై స్థానికులు, ప్రయాణికులు కూడా మండిపడుతున్నారు. అఘోరీలు అంటే ప్రజలకు దూరంగా జీవనం గడుపుతుంటారని.. నిత్యం దైవస్మరణతో జీవిస్తారని.. ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించరంటూ మండిపడుతున్నారు.