ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మహిళలపై అఘాయిత్యాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం నడిచింది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ ఐదు నెలల కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందన్నారు.మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. దిశ చట్టం తీసుకొస్తారా, దిశ యాప్ కొనసాగిస్తారా లేదా అని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వ పాలనలో చాలా లోపాలున్నాయన్నారు మంత్రి అనిత. హోం మంత్రి అనిత వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటూ నినాదాలు చేశారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కారణంతోనే 'నీలాంటి' వారు సభకు వస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ఉద్దేశించి మంత్రి అనిత అన్నారు. తన సమాధానం వినటానికి దమ్ము, ధైర్యం కావాలని మంత్రి అనిత అన్నారు.