ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు టీడీపీ కూటమి సర్కారు శుభవార్త వినిపించింది. చేనేత మగ్గాలు ఉన్నవారికి నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ అందిస్తామని తెలిపింది. అలాగే మరమగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఏపీ జౌళి శాఖ మంత్రి సవిత అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి సవిత.. గత వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం ఓట్ల కోసం ఉత్తుత్తి బటన్ నొక్కి చేనేతలను మోసం చేసిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఐదేళ్లు చేనేతలు కష్టాలు పడ్డారన్న మంత్రి.. టీడీపీ కూటమి సర్కారు వారికి అండగా నిలుస్తుందని చెప్పారు.
ఇందులో భాగంగా చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని మంత్రి సవిత ప్రకటించారు. అలాగే ఐదు శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, కర్నూలు, విజయనగరంలో చేనేతశాలలు ఏర్పాటు చేస్తామంటూ నేతన్నలపై వరాల జల్లు కురిపించారు. చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్న జౌళి శాఖ మంత్రి సవిత.. ఇందుకోసం విదేశాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్లు అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్న మంత్రి.. వచ్చే ఆరు నెలల్లోగా రాష్ట్రంలో మూడు ఆప్కో షోరూమ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్ సహకారంతో పది చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
మరోవైపు వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని ఏపీ విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ శాఖలో రూ.1.29లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. పీపీఏలు రద్దు చేయవద్దని అప్పట్లో కేంద్రం చెప్పినా వినిపించుకోలేదన్న గొట్టిపాటి రవికుమార్.. విద్యుత్ వ్యవస్థను గాడినపెట్టేలా టీడీపీ కూటమి సర్కారు పనిచేస్తోందన్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయం కోసం వినియోగించే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మండలిలో గొట్టిపాటి రవికుమార్ తేల్చిచెప్పారు.