అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో (పీఏసీ) సభ్యుల ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్య క్రమంలో ఓటు వేయాలో ఎన్డీఏ కూటమి విప్‌లకు బాధ్యత అప్పగించింది. ప్రజాపద్దులు పీఏసీ, అంచనాలు(ఎస్టిమేట్స్), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేయనున్నారు.
అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. అయితే కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో మూడు కమిటీలకు ముగ్గురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం10 చొప్పున నామినేషన్లు దాఖలవ్వటంతో పోలింగ్ అనివార్యమైంది. ఛైర్మన్లుగా పీఏసీకి పులపర్తి ఆంజనేయులు, అంచనాల కమిటీకి జోగేశ్వర రావు, పీయూసీకి కూన రవికుమార్‌ల ఎన్నిక దాదాపు ఖరారు చేశారు. కాగా వైఎస్సార్సీపీ తరుపున పీఏసీ మెంబర్‌కు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి నామినేషన్ వేశారు. ఈ క్రమంలో అసెంబ్లీకి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, విరూపాక్ష , బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి తదితరులు వచ్చారు. ఓటింగ్‌లో పాల్గొనే అంశంపై ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారు. ఓటింగ్‌ను బహిష్కరించే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరికాసేపట్లో అధికారకంగా ప్రకటించే అవకాశముంది.