ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా తనను కలిసి అందించిన వినతులు, ఫిర్యాదులనే కాకుండా సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చే సమస్యలను కూడా నారా లోకేష్ అంతే వేగంగా పరిష్కరిస్తుంటారు.ఈ నేపథ్యంలో పలువురు తమ సమస్యలను సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ దృష్టికి తెస్తుంటారు. తాజాగా కాణిపాకం ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ మురుగదాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన ఘటనపై ఓ నెటిజన్ నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై నారా లోకేష్ కూడా అంతే వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నారు. దీంతో సమస్య పరిష్కారమైంది.
ఇక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాణిపాకం వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా మురుగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంది. కాణిపాకం వినాయకుడి ఆలయానికి వచ్చే భక్తులు తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు. ఆలయ నిర్మాణం, పరిసరాలను చూసి మణికంఠేశ్వరస్వామి ఆలయం వద్ద ఫోటోలు దిగాలనుకుంటారు. విశాఖ నుంచి వచ్చిన ఓ భక్తుడు కూడా ఇలాగే ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తే.. అక్కడున్న ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. ఫోటోలు దిగడానికి వీల్లేదని.. ఫోటోలు తీయాలంటే తమకు డబ్బులు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో ఆ యువకుడు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో ఉంచాడు. ఆలయానికి వచ్చిన మరికొంత మంది భక్తులు కూడా ఇదే విషయంపై ఫిర్యాదులు చేశారు. గుడి వద్ద ఫోటోలు దిగాలంటే డబ్బులు అడుగుతున్నారని మండిపడ్డారు.
ఈ సమస్యను మరో నెటిజన్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఆలయం వద్ద ఫోటోలు దిగాలనుకుంటే డబ్బులు అడుగుతున్నారంటూ.. లోకేష్ అన్నా.. ఒకసారి ఈ సమస్యను చూడన్నా.. దయచేసి చర్యలు తీసుకోండన్నా అంటూ వీడియో కూడా షేర్ చేశారు. దీంతో నెటిజన్ ట్వీట్‌కు మంత్రి నారా లోకేష్ స్పందించారు.
ఈ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూనే.. పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నారా లోకేష్ ఆదేశాలతో దేవాదాయశాఖ అధికారులు స్పందించారు. భక్తుల సమస్యను పరిష్కరించారు. దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలయ భక్తుల సమస్య పరిష్కరించామని.. శ్రీ మురగదాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం వద్ద సొంత కెమెరాలు, సెల్‌ఫోన్లతో ఫోటోలు తీసుకోవచ్చని.. దీనికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదంటూ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ సత్వర స్పందనతో భక్తుల సమస్య వెంటనే పరిష్కారమైందంటూ సోషల్ మీడియాలో నెటిజనం ప్రశంసిస్తున్నారు. భక్తుల తరుఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.