ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. అయితే, పదవీ విరమణ పొందిన తర్వాత ఒక్కసారిగా వచ్చే శాలరీ ఆగిపోతుంది. పెన్షన్ అంతంత మాత్రంగానే ఉంటుంది. దీంతో వృద్ధాప్యంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే సంపాదిస్తున్న సమయంలోనే రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని పెద్దలు చెబుతుంటారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచే నెల నెలా కొంత మొత్తం పొదుపు చేసుకుంటూ వెళ్తే రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పడుతుంది. ఆలస్యం చేసిన కొద్ది ఆ నిధి తగ్గిపోతుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అనేది రిటైర్మెంట్ కోసం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి ఇందులో 30 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే రిటైర్మెంట్ తర్వాత ఎంతొస్తుంది? నెలకు రూ.1 లక్ష పెన్షన్ రావాలంటే ఏం చేయాలి?
నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2004, జనవరి 1న ప్రారంబించింది. తొలుత దీనిని ప్రభుత్వ సర్వీసుల్లో కొత్తగా చేరిన వారికి మాత్రమే అమలు చేశారు. ఆ తర్వాత మే 1, 2009 నుంచి దేశంలోని ప్రజలందరికీ వాలంటరీ ప్రాతిపదికన అందించారు. అంసఘటిత రంగంలోని కార్మికులు సైతం ఇందులో చేరేందుకు అవకాశం కల్పించారు. ఈ స్కీమ్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత దేశ ప్రజలందరికీ బెనిఫిట్స్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో చేరాక పర్మనెంటే రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ కేటాయిస్తారు. ఇది లైఫ్ టైమ్ ఉంటుంది.
ఇందులో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. టైర్-1 అకౌంట్ అనేది రిటైర్మెంట్ సేవింగ్స్ అకౌంట్. ఇందులో డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఆంక్షలు ఉంటాయి. ఇక టైర్ 2 అకౌంట్ అనేది వాలంటరీ సేవింగ్స్ అకౌంట్. ఇందులోని డబ్బులు నచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో రూ.5 లక్షలలోపు కార్పస్ ఉన్న సమయంలో 100 శాతం వెనక్కి తీసుకోవచ్చు. కానీ, రూ.5 లక్షలు దాటినప్పుడు అందులో 40 శాతం కచ్చితంగా యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేసేందుకు ఉపయోగించాలి. యాన్యుటీ ప్లాన్ ద్వారా నెల నెలా పెన్షన్ వస్తుంది. మిగిలిన 60 శాతం వెనక్కి తీసుకోవచ్చు.
నెలకు రూ.1 లక్ష పెన్షన్ రావాలంటే?
ఒక 30 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఎన్‌పీఎస్‌లో పొదుపు చేయడం మొదలు పెట్టాడు అనుకుందాం. అతడికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నెలకు రూ.1 లక్ష పెన్షన్ రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. నెలకు రూ.1 లక్ష పెన్షన్ రావాలంటే ఇప్పటి నుంచే నెలకు రూ.30 వేల చొప్పున పొదుపు చేస్తూ ఉండాలి. వచ్చే 30 ఏళ్ల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే 10 శాతం వార్షిక రాబడి అంచనాతో మొత్తం కార్పస్ రూ.4.56 కోట్లు అవుతుంది. పెట్టుబడి రూ.72 లక్షలు దానిపైన వడ్డీ రూ.3.84 కోట్లు వస్తుంది. ఇందులో 40 శాతం అంటే రూ.1.82 కోట్లు యాన్యుటీ కొనుగోలు చేయాలి. మిగిలిన రూ.2.74 కోట్లు విత్ డ్రా చేసుకోవచ్చు. యాన్యుటీపై సగటున 6 శాతం రాబడి వస్తుందని అంచనా వేసిన నెలకు రూ.1 లక్ష పెన్షన్ లభిస్తుంది.