ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజూ వందలకొద్దీ వీడియోలు , వేలకొద్దీ పోస్టులు వైరల్ అవుతుంటాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు అమ్మాయిలను కప్ బోర్డులో కట్టేసి ఉంచిన వీడియో, పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీని వెనుక ఉన్న అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
క్లెయిమ్..
ఓ ముస్లిం వ్యక్తి ఇంట్లో హిందూ అమ్మాయిలను బంధించారంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముస్లిం వ్యక్తి ఇంట్లోని అల్మారాలో బంధించిన అమ్మాయిలను ఇద్దరు వ్యక్తులు విడిపిస్తున్నట్లుగా వీడియోలో ఉంది. యువతులను కిడ్నాప్ చేసిన తర్వాత అల్మారాలో ఉంచినట్లు ఆరోపిస్తూ.. గాయాలతో వారు ఏడుస్తున్నట్లు వీడియోలో చూపించారు. డిసెంబర్ 15వ తేదీన ఫేస్ బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఒక ముస్లిం వ్యక్తి ఇంటి నుంచి అనేక మంది హిందూ మహిళలను రక్షించినట్లు వీడియోను పంచుకున్నారు. హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసిన ముస్లిం అబ్బాయిలు అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
అసలు నిజమేంటి?
అయితే ఈ వీడియో అబద్ధమని తేలింది. స్క్రిప్ట్ ప్రకారం తీసిన వీడియోను నిజమైనదిగా చెప్తూ సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు గుర్తించాం.
ఎలా తెలిసిందంటే?
ఫ్యాక్ట్ చెకింగ్‌లో భాగంగా వైరల్ అవుతున్న వీడియో కీ ఫ్రేమ్‌లను గూగుల్ లెన్స్ ఉపయోగించి సెర్చ్ చేశాం. అది కాస్తా. ఫిబ్రవరి 12, 2023న నవీన్ జంగ్రా అనే ఛానెల్ ద్వారా పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోను చూపించింది. వీడియోలోని కంటెంట్ కూడా వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌తో సరిపోయింది. ఈ వీడియో లింక్ ఇక్కడ ఉంది.
మరింత వివరాలు తెలుసుకునేందుకు ఆ యూట్యూ్బ్ ఛానెల్ అప్ లోడ్ చేసిన మరిన్ని వీడియోలను పరిశీలించాము. ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలను అనేకం అప్ లోడ్ చేసినట్లు గుర్తించాం. వినోదం కోసం ఓ స్క్రిప్ట్ ప్రకారం వీడియోలు రూపొందించినట్లు తేలింది. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రూపొందించిన ఓ స్క్రిప్టెడ్ వీడియోలోని భాగాన్ని నిజమైనదిగా చెప్తూ సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అబద్ధపు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించాము.
అసలు వాస్తవ ఇది
హిందూ అమ్మాయిలను ముస్లిం వ్యక్తి ఇంట్లో బంధించారంటూ వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా అబద్ధం. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా స్క్రిప్టెడ్ వీడియోను.. నిజమైనదిగా షేర్ చేస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా ఫ్యాక్ట్ చెకింగ్‌లో తేలింది.