ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థలో అనివార్యమైన భాగం. అయితే, దీనిని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ, ఇది మన కొనుగోలు శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇన్‌ఫ్లేషన్ అనేది సగటున ప్రతి ఏడాది 6 శాతంగా పెరుగుతూ వస్తోంది. అంటే దీని అర్థం ప్రతి ఏడాది వస్తువులు, సేవల విలువ ప్రతి సంవత్సరం సగటున 6 శాతం చొప్పున పెరుగుతున్నాయి. అయితే, ఇది మీ పైన ఎంత ప్రభావం చూపిస్తుంది. ఇంతకీ ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ప్రస్తుతం రూ.50 లక్షలుగా ఉన్న ఇంటిని 10 సంవత్సరాల తర్వాత కొనుగోలు చేయాలంటే ఎన్ని లక్షలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది? అనే విషయాలను తెలుసుకుందాం.
ద్రవ్యోల్బణం అంటే ఏంటి?
ఆర్థిక నిపుణుల ప్రకారం.. వస్తువులు, సేవలకు ఉన్న డిమాండ్ వల్ల ద్రవ్య విలువ తగ్గి ధరలు పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. వస్తు, సేవల ఉత్పత్తి కంటే డిమాండ్ ఎక్కువై ధరలు పెరగుతాయి. వస్తు, సేవల ఉత్పత్తి రేటు కంటే ధరల పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటే దానిని ద్రవ్యోల్బణం అంటారు. ఇది డబ్బు కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. అంటే ప్రస్తుతం రూ.100తో కొనగలిగే వస్తువును భవిష్యత్తులో కొనుగోలు చేయలేవు. దాని ధర పెరిగిపోతుంది. ఉదాహరణకు ఐదు సంవత్సరాల క్రితం ఉన్న వస్తువులు, పెట్రోల్ ధరలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
రూ.50 లక్షల విలువ 10 ఏళ్ల తర్వాత ఎంతుంటుంది?
ప్రతి సంవత్సరం 6 శాతం చొప్పున ద్రవ్యోల్బణం పెరుగుతుందని అనుకుందాం. మీరు ప్రస్తుతం రూ.50 లక్షలు ఉన్న ప్రాపర్టీ లేదా కారు, ఇల్లు కొనుగోలు చేద్దాం అనుకున్నారు. కానీ, వివిధ కారణలతో కొనలేకపోయారు. తర్వాత కొందాంలే అని వదిలేశారు. అదే ప్రాపర్టీ లేదా కారును 10 సంవత్సరాల తర్వాత కొనుగోలు చేయాలంటే మీరు దాదాపు రూ.90 లక్షలు వెచ్చించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఏటా 6 శాతం ఇన్‌ఫ్లేషన్ అనేది మీ డబ్బు విలువన తగ్గించేస్తుంది. అంతే కాదు ప్రతి ఏటా కాంపౌండింగ్ ఇన్‌ఫ్లేషన్ లెక్కలోకి వస్తుంది. ఈ కారణంగానే అదనంగా రూ.40 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుంది.
ప్రస్తుతం రూ.50 లక్షలు ఉన్న భూమి విలువ ఏడాది తర్వాత 6 శాతం పెరిగి రూ.53 లక్షలు అవుతుంది. ఇక రెండేళ్ల తర్వాత అది రూ.56.18 లక్షలు అవుతుంది. ఇలా ప్రతి ఏటా 6 శాతం చొప్పున కాంపౌండింగ్ ఇన్‌ఫ్లేషన్ పని చేసి 10 సంవత్సరాల నాటికి రూ.50 లక్షల విలువ రూ.89.54 లక్షలకుపైగా అవుతుంది. అంటే దాదాపు రెట్టింపు అవుతుంది. మీరు భవిష్యత్తులో కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ధరల పెరుగుదలను ఎదుర్కొనేందుకు ఈక్విటీలు, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్లేషన్ లింక్డ్ బాండ్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి.