‘వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్’ కార్యక్రమం రికార్డులను బద్దలు కొట్టింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ యూనియన్‌లో చోటు సంపాదించి చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ చారిత్రాత్మక కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ఏకీకృతం చేసి, సామూహిక ధ్యానానికి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది.
ఐక్యతకు, అంతర్గత శాంతికి అసమానమైన వేడుకగా మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం నిలిచింది. 180కి పైగా దేశాల ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమం ధ్యానానికి గల పరివర్తన శక్తిని, ధ్యానమే ప్రపంచ ఉద్యమంగా మారిన తీరును కళ్లకు కట్టింది. ఐక్యరాజ్యసమితిలో ప్రారంభోత్సవ కార్యక్రమంతో మొదలై వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వంలో జరిగిన ప్రత్యక్ష ధ్యాన కార్యక్రమంతో ముగిసిన ఈ వేడుక ఖండాలన్నిటిలోనూ ధ్యాన తరంగాలను సృష్టించింది.
బద్దలైన రికార్డులు:
గురుదేవ్ నేతృత్వంలోని ధ్యాన సెషన్ ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ప్రపంచ శాంతి, సామరస్యాల కోసం ధ్యానం చేసేందుకు లక్షలాది మంది పరోక్షంగా, భౌతికంగా అనేకచోట్ల హాజరయ్యారు. వారందరినీ ధ్యానంలోకి నడిపించే ముందు గురుదేవులు ధ్యానానికి గల అర్థాన్ని వివరించారు.
‘ధ్యానం అనేది ఆలోచనతో తెలుసుకోవడం అనేదాని నుంచి స్వయంగా తెలుసుకునే అనుభూతికి ప్రయాణం.. ధ్యానం చేయడానికి మీరు మొదట ఎక్కువ ఆలోచించడం మానేసి, ఉన్నదానిని అనుభూతి చెందాలి... ఆపై ఆ భావనను సైతం దాటిపోయి, అంతరంగంలోకి ప్రయాణించాలి.. మీరు తెలివిగా, సున్నితంగా, నిర్మలంగా ఉండాలనుకుంటే, మీరు ధ్యానం చేయాలి. ధ్యానం అనేది నిష్క్రియం కాదు. ఇది మిమ్మల్ని మరింత ఉత్సాహభరితంగా, అదేసమయంలో ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మీరు విప్లవకారులుగా ఉండాలనుకున్నా సరే, మీకు ధ్యానం ఆవశ్యకం’ అని గురుదేవ్ వివరించారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రపంచ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, నిపుణులు సహా అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో రైతులు, విద్యాసంస్థలు, దృష్టిలోపాలకు చికిత్స పొందిన పిల్లలు, కార్పొరేట్లు, సైనికులు, ఆరోగ్య సంరక్షకులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, గృహిణులు, గ్రామీణులు, ఆదిమ జాతులు, చివరకు ఖైదీలు సైతం పాల్గొనటం ద్వారా ధ్యానానికి గల సార్వత్రిక ఆకర్షణ, ప్రభావం తేటతెల్లమైంది. శాంతి, సామరస్యాలకోసం ప్రపంచమంతా ఒకటైన క్షణం అది.
‘వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్’ కార్యక్రమానికి లభించిన అద్భుతమైన స్పందన, ప్రపంచవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యం ఇవి సామూహిక ధ్యానానికి ఉండే పరివర్తనా శక్తిని మనకు చూపాయి. చిరస్మరణీయమైన ఈ ప్రయత్నంతో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లక్షలాది మందిని ధ్యానంలో సమైక్యం చేయడమే కాకుండా అంతర్గత శాంతి, సార్వత్రిక సామరస్యం కోసం ప్రపంచవ్యాప్త ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది.
ఐరాసలో భారత శాశ్వత మిషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం
మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితిలోని భారతదేశపు శాశ్వత మిషన్, ఇక్కడి కోర్ గ్రూపు సభ్యులు, ఐరాసలోని వివిధ దేశాల రాయబార బృందాలు, విశ్వ విఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక గురువు, మానవతామూర్తి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది.