ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల వీడియోలు ఇవ్వడం కుదరదు.. ఈసీ నిబంధనల్లో మార్పుపై దుమారం

national |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2024, 07:37 PM

ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులు తనిఖీల విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన మార్పులు కొత్త వివాదానికి తెరలేపాయి. ఈ సమాచారం ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని నిబంధనలు సడలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానా ఎన్నికలపై పలు వ్యాజ్యాలు దాఖలైన తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకొంది. ఎలక్ట్రానిక్ సమాచారమైన సీసీటీవీ ఫుటేజీ, అభ్యర్థుల వీడియో రికార్డులను ప్రజల పరిశీలన కోసం బయపెట్టాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.


ఎన్నికల చట్టం- 1961లోని రూల్‌ 92 (3)(ఏ)లో ‘ఎన్నికలకు సంబంధించిన ఇతర పత్రాలను ప్రజల తనిఖీ నిమిత్తం అందుబాటులో ఉంచాలి’ అని చెబుతోంది. కానీ, ఈ నిబంధనను తాజాగా కేంద్ర న్యాయ శాఖ సవరించింది. ‘ఎన్నికలకు సంబంధించి ఈ నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొన్న పత్రాలను మాత్రమే అందుబాటులో ఉంచాలి’ అని తెలిపింది. ‘అన్ని పత్రాలు’ అన్న స్థానంలో ‘ఈ రూల్స్‌లో పేర్కొన్న పత్రాలు’ అని సవరణ చేసింది. అంటే ఆ నిబంధనల్లో సీసీటీవీ ఫుటేజీ, వీడియోలు వంటి ప్రస్తావనలు లేకపోవడంతో వాటిని బహిర్గతం చేయరు. ఎలక్ట్రానిక్ సమాచారం దుర్వినియోగమవుతోందని, అందుకే ఈ సిఫార్సు చేశామని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు.


‘‘కానీ రూల్స్‌ను సవరించినప్పటికీ పోటీ చేసిన అభ్యర్థులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.. ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎలక్ట్రానిక్ సమాచారం పొందొచ్చు’ అని ఆయన తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను బయటపెట్టడం వల్ల ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లుతోందని, అందుకే నిషేధం విధించామని వ్యాఖ్యానించారు. ఈ ఫుటేజ్‌ల సాయంతో కృత్రిమ మేధ ద్వారా ఫేక్ వీడియోలను తయారు చేస్తున్నారని చెప్పారు.


కాగా, హర్యానా ఎన్నికలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ, వీడియోలు బయటపెట్టాలని మెహమూద్‌ ప్రాచా అనే లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై పంజాబ్ హర్యానా హైకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, వాటిని అడ్డుకోవడానికి ఈ నిబంధనలను సడలించారన్న విమర్శలు వస్తున్నాయి. నిబంధనను మార్చడంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పారదర్శకతకు ఈసీ ఎందుకు భయపడుతోందని నిలదీసింది. దీనిపై కోర్టు వెళ్తామని ప్రకటించింది. న్యాయపరంగా నిబంధనను సవాలు చేస్తామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వెల్లడించారు. న్యాయస్థానాల ఆదేశాలను అమలు చేయాల్సిన ఈసీ.. అందుకు విరుద్ధంగా నిబంధనలకు సవరణ చేయడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.


‘‘దేశంలో ఎన్నికల ప్రక్రియ క్షీణిస్తోందని తాము చేస్తోన్న వాదనలకు ఇదే బలమైన సాక్ష్యం.. . సమాచారం ప్రక్రియలో బహిర్గతం విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది.- చట్టబద్ధంగా ప్రజలతో పంచుకోవాల్సిన మొత్తం సమాచారాన్ని ఇవ్వాలని పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశిస్తే... అందుకు ఈసీ అంగీకరించింది’’ అని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com