కేరళలోని శబరిమలలో మండల-మకరవిళక్కు వార్షిక పూజలు జరుగుతున్నాయి. గత నెల 15వ తేదీన ప్రారంభం అయిన శబరిమల అయ్యప్ప దర్శనాలు.. జనవరి 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నిత్యం దాదాపు లక్ష మంది భక్తులు.. అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వస్తున్నారు. భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండటంతో.. అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులపై అటవీ జంతువులు దాడి చేస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా తన తండ్రితో కలిసి అయ్యప్ప దర్శనానికి వచ్చిన ఓ బాలుడిపై అడవి పంది దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు.
కేరళలోని అలప్పుజా జిల్లాలోని పజవీడు గ్రామానికి చెందిన 9 ఏళ్ల శ్రీహరి తన తండ్రి మనోజ్ సహా 21 మందితో కలిసి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చాడు. ఈ క్రమంలోనే వారంతా మరక్కూట్టం నుంచి శరంకుతి మీదుగా వలియ నడప్పంతల్ ప్రాంతానికి దిగుతుండగా సన్నిధానం కెఎస్‌ఈబీ కార్యాలయం సమీపంలో ఒక్కసారిగా అడవి పంది శ్రీహరిపై దాడికి తెగబడింది. శబరిమల సన్నిధానం సమీపంలోనే శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఈ దాడి జరిగింది. ఇందులో శ్రీహరి తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో శ్రీహరి తండ్రి మనోజ్ సహా మిగితా సభ్యులు అలర్ట్ కావడంతో ఆ అడవి పంది పిల్లాడిని వదిలేసి పారిపోయింది. దీంతో హుటాహుటిన శ్రీహరిని.. చికిత్స నిమిత్తం సన్నిధానం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీహరికి డాక్టర్లు చికిత్స అందిస్తుండగా.. అతడి పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక అడవి పంది దాడి చేయడంతో శ్రీహరి కుడి మోకాలికి తీవ్ర గాయాలైనట్లు డాక్టర్లు చెప్పారు.
ఇక ఇటీవలె ఇలాంటి ఘటనే శబరిమలలో చోటు చేసుకుంది. రెండు వారాల క్రితం పోలీస్ బ్యారక్‌లో భోజనం చేసి బయటికు వచ్చిన కన్నూర్‌కు చెందిన ఏఎస్‌ఐపై అడవి పంది దాడి చేసింది. ఈ అడవి పంది దాడిలో ఆ కన్నూర్ ఏఎస్ఐకి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. శబరిమలలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు.. సన్నిధానంకు నడక మార్గంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంటున్నారు. ఒంటరిగా వెళ్లకుండా అయ్యప్ప భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. అలా చేస్తే.. అటవీ జంతువులు దాడి చేయకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారు.