చైనాలోని ఒక ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయినట్లు ఆరోపణలు రాగా.. ఆ వైరస్ ప్రపంచ దేశాలను ఎంత గడగడలాడించిందో గత కొన్నేళ్లుగా మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న ఒక్క కొవిడ్ మహమ్మారి.. కోట్లాది మందికి సోకింది. ఇక ఇప్పటికీ ఆ కొవిడ్ వైరస్.. కొత్త కొత్త మ్యుటేషన్ల రూపంలో మానవాళిపై విరుచుకుపడుతూనే ఉంది. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా ఆ వైరస్ రూపాంతరం చెందడంతో కరోనా మహమ్మారిని అంతం చేయలేకపోతున్నాం. ఇలా ల్యాబ్ నుంచి లీక్ అయిన ఒక్క కరోనా వైరస్ ఇంత ప్రళయాన్ని సృష్టిస్తే.. తాజాగా జరిగిన సంఘటన వింటే మాత్రం ఇంకెంత భయపడాల్సి వస్తుందో. ఎందుకంటే ఒక ల్యాబ్ నుంచి ఏకంగా 100 ప్రాణాంతక వైరస్‌లు మిస్ అయినట్లు తాజాగా ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
కరోనా భయాల నుంచి ఇప్పుడిప్పుడే భయటపడుతున్న మానవాళికి పిడుగులాంటి వార్త ఇది. ఆస్ట్రేలియాలోని ఒక ల్యాబ్ నుంచి దాదాపు 100 ప్రాణాంతక వైరస్ నమూనాలు చోరీకి గురైనట్లు అక్కడి అధికారులు తాజాగా బయటికి వెల్లడించడం ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ల్యాబ్ నుంచి హెండ్రా వైరస్‌తో సహా 100 ప్రమాదకరమైన వైరస్ నమూనాలు కనిపించడం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ బయోసెక్యూరిటీ ఉల్లంఘనపై ఇప్పటికే అక్కడి అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
క్వీన్‌ల్యాండ్స్‌లోని వైరాలజీ లేబొరేటరీలో జరిగిన ఈ సంఘటన సేఫ్టీ ప్రోటోకాల్స్‌లో అతిపెద్ద లోపంగా అక్కడి అధికారులు అభివర్ణిస్తున్నారు. క్వీన్స్‌ల్యాండ్ హెల్త్ అధికారుల రిపోర్టుల ప్రకారం.. హెండ్రా వైరస్, లైసా వైరస్, హాంటా వైరస్ కలిగిన నమూనాలను నిల్వ చేసే ఫ్రీజర్ ధ్వంసం అయినట్లు గుర్తించారు. అందులో ఉన్న దాదాపు 100 రకాల వైరస్ శాంపిల్స్ కనిపించకుండా పోయినట్లు తెలిపారు. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ మీడియా సమావేశంలో ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి టిమ్ నికోల్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సంఘటన 2023 ఆగస్టులో జరిగినట్లు ఆస్ట్రేలియా మంత్రి చెప్పారు. అయితే ఆ వైరస్‌లను ఎవరైనా ఎత్తుకెళ్లారా.. లేక పూర్తిగా నాశనం చేశారా అనే దానిపై మాత్రం ఇప్పటివరకు ఆ వైరాలజీ ల్యాబ్ క్లారిటీ ఇవ్వలేదు. ఆ శాంపిల్స్ కనబడకుండాపోయిన ల్యాబ్‌లో వివిధ వ్యాధికారక రోగనిర్ధారణ, పరిశోధన, నిఘాలకు సంబంధించిన వాటిపై పరిశోధనలు జరుగుతున్నాయని మంత్రి టిమ్ నికోల్స్ స్పష్టం చేశారు.
ఇక అక్కడి ల్యాబ్ నుంచి వైరస్ శాంపిల్స్ కనిపించకుండా పోయినప్పటికీ.. వాటి వల్ల సమాజానికి ఎలాంటి ముప్పు లేదని చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జాన్ గెరార్డ్ పేర్కొన్నారు. అయితే ఆ వైరస్ శాంపిల్స్ నిల్వ ఉండాలంటే వాటికి అతితక్కువ ఉష్ణోగ్రతలు కావాలని తెలిపారు. అలాంటి వాతావరణం లేని పక్షంలో అవి చాలా వేగంగా చనిపోతాయని చెప్పారు. పైగా గత 5 ఏళ్లుగా క్వీన్స్‌లాండ్‌లో హెండ్రా వైరస్ , లైసా వైరస్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని వెల్లడించారు. ఇక ఆస్ట్రేలియా ప్రజలకు ఎవరికీ హాంటా వైరస్ సోకలేదని డాక్టర్ గెరార్డ్ తెలిపారు. అయినప్పటికీ ఈ వైరస్ నమూనాలు కనిపించకుండా పోవడం పట్ల నిపుణులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఆ ల్యాబ్ నుంచి చోరీకి గురైన వైరస్ శాంపిల్స్‌లో హాంటా వైరస్ అనేది చాలా ప్రమాదకరమైందని చెబుతున్నారు. ఇది కరోనా వైరస్ కంటే ఎక్కువ మరణాలకు దారి తీసే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. మిగిలిన ట్యూబ్‌లలో 223 లైసా వైరస్ నమూనాలు ఉన్నాయని.. అది కూడా అధిక మరణాల రేటు కలిగించే వైరస్ అని చెప్పారు. హాంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్‌కు కారణం అవుతుందని.. ఇది సుమారు 38 శాతం మరణాల రేటును కలిగిస్తుందని చెబుతున్నారు.
ఇక హెండ్రా వైరస్ జంతువుల నుంచి మానవులకు సోకే జూనోటిక్ వైరస్ మాదిరిగా పనిచేస్తుందని చెప్పారు. రేబిస్‌తో కూడిన లైసా వైరస్‌కు సరైన చికిత్స అందిచకుంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. అలాగే అమెరికాకు చెందిన US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం హాంటా వైరస్ తీవ్రమైన అనారోగ్యం, మరణానికి కూడా దారి తీస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ శాంపిల్స్ ల్యాబ్ నుంచి ఎలా మిస్ అయ్యాయి.. ఇంతకాలం ఎందుకు కనిపించకుండా పోయాయనే కోణంలో మాత్రమే విచారణ జరుగుతోందని తెలుస్తోంది. అసలు సమస్యను పరిష్కరించామని ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి చెబుతున్నా.. వీటివల్ల ఎటు నుంచైనా ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.