భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంపాలై గురువారం రోజు ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతితో దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఈక్రమంలోనే ఆయన 30 సంవత్సరాల క్రితం ఆర్థిక మంత్రిగా చేపట్టిన ఆర్థిక సంస్కసరణలు, విధాన నిర్ణయాలను అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఎలా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారో తలుచుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు మన్మోహన్ సింగ్ జీవితం కూడా పూర్తిగా మారిపోవడానికి కారణం.. ఆ ఒక్క ఫోన్ కాలే. అయితే అది చేసింది ఎవరు, ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1991 జూన్‌లో నెదర్లాండ్స్‌లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన మన్మోహన్ సింగ్ అప్పుడే ఢిల్లీకి తిరిగి వచ్చారు. రోజంతా అలిసిపోయి ఉండడంతో కాసేపు పడుకున్నారు. ఈక్రమంలోనే మన్మోహన్ సింగ్ అల్లుడు విజయ్ తంఖాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎవరా అని లేపి మాట్లడగా.. అటు నుంచి పీసీ అలెగ్జాండర్ స్వరం వినిపించింది. వెంటనే మీ మామయ్యను లేపండని ఆయన చెప్పగా.. విజయ్ వెంటనే మన్మోహన్ సింగ్‌ను నిద్ర లేపారు. ఆ తర్వాత కొన్ని గంటలకే మన్మోహన్ సింగ్, అలెగ్జాండర్‌లు అత్యవసర సమావేశం అయ్యారు.
అప్పుడే అతడు.. మీరే కాబోయే ఆర్థిక మంత్రి అంటూ మన్మోహన్ సింగ్‌కు చెప్పాడు. కానీ ఆయన ఆ విషయాన్ని నమ్మలేదు. ఎందుకంటే అప్పటికీ ఆయన యూజీసీ ఛైర్మన్‌గా పని చేస్తున్నారు. రాజకీయాల్లో కూడా అంతగా ఆయనకు గుర్తింపు లేదు. దీంతో మన్మోహన్ సింగ్.. అలెగ్జాండర్ చెప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ జూన్ 21వ తేదీన యూజీసీ కార్యాలయంలో కూర్చున్న మన్మోహన్ సింగ్‌ను చూసిన పీవీ నరసింహారావు.. ఆయనతో మాట్లాడారు.
మీరే ఆర్థిక మంత్రి అని పీవీ చెప్పగా.. మన్మోహన్ సింగ్ షాక్ అయ్యారు. మీకు ఇప్పటికే అలెగ్జాండర్ ఈ విషయం చెప్పారు కదా అని అడగ్గా.. ఆయనేదో సరదాకు అన్నారనుకుంటున్నాని చెప్పారు. అవేవీ పట్టించుకోని నరసింహారావు మాత్రం ఇంటికెళ్లి త్వరగా బట్టలు మార్చుకుని రండి, ప్రమాణస్వీకారం చేయాలని చెప్పారు. అలా ఇంటికెళ్లి వచ్చిన ఆయన.. కొత్తజంటులో ఉండడం చూసి అంతా షాకయ్యారు. అయితే ఈ విషయాన్ని నేరుగా మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ రాసిన.. "స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుశరణ్" అనే పుస్తకంలో రాసి ఉంది.
మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా చేసిన ఈ ఒక్క ఫోన్ కాల్.. భారత దేశ ఆర్థిక స్థితి గతులను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా 1991లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితిని ఎదుర్కుంటుంది. దేశ ద్రవ్యలోట్ 8.5 శాతానికి పడిపోగా.. విదేశీ మారకపు నిల్వలు 2500 కోట్లకు పడిపోయాయి. కేవలం 2 వారాల దిగుమతులకు చెల్లింపులు చేసేంత స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచ బ్యాంకులు సైతం రుణాలు ఇచ్చేందుకు నిరాకరించాయి. రుణ చెల్లింపు వైఫల్య ముప్పు కూడా దేశాన్ని వెంటాడుతోంది. అయితే ఈ సమస్యలు అన్నీ ముందే మన్మోహన్ సింగ్‌కు తెలుసు. వీటికి పరిష్కారాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి.
జులై 21వ తేదీన జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. అప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజ్ విధానాన్ని దూరం చేస్తూ.. కొన్ని కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా రూపాయి విలువను తగ్గించేందుకు డిప్యూటీ గవర్నర్ సి రంగరాజన్‌తో కలిసి పని చేశారు. అలాగే అప్పటి వాణిజ్య మంత్రి పి చిదంబరం భాగస్వామ్యంతో ఎగుమంతి నియంత్రణలను తొలగించారు. ఇలా అనేక సంస్కరణలు చేపట్టి ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరుకోవడానికి కారణం అయ్యారు. ముఖ్యంగా 1991 మార్చి 31వ తేదీ ముగిసే వరకు టోకు ధరల సూచీ 12.1 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే వినియోగదారుల సూచిక 13.6 శాతం పెరుగుదలను నమోదు చేసింది.