మన్మోహన్ సింగ్ లేని లోటు తమ పార్టీకి, దేశానికి పూడ్చలేనిదని ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అన్నారు. వ్యక్తిగతంగా తాను ఓ మంచి స్నేహితుడిని, తత్వవేత్తను, మార్గదర్శిని కోల్పోయానన్నారు. వివేకానికి, వినయానికి ప్రతిరూపమైన ఓ గొప్ప నాయకుడిని, మార్గదర్శకుడిని పార్టీ కోల్పోయిందన్నారు.ఆయన దూరదృష్టి కారణంగా లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడిగా ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందారన్నారు. మన్మోహన్ వ్యక్తిగతంగా సౌమ్యుడేనని, విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో దృఢనిశ్చయంతో ఉండేవారన్నారు.కాగా, మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సంతాపం తెలిపింది. ఆయన ఆశయాలను, వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతామని తీర్మానం చేసింది. ఆయన దేశం కోసం జీవితాన్ని ధారపోశారని పేర్కొంది. నాయకుడిగా, ఆర్థికవేత్తగా, నిరాడంబరమైన వ్యక్తిగా ఆయన జీవితం చాలామందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆయన వారసత్వం ఎప్పటికీ జీవించే ఉంటుందని, దేశాభివృద్ధి కోసం అందర్నీ ప్రేరేపిస్తుందని సీడబ్ల్యూసీ పేర్కొంది.