ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్‌తో యుద్ధంపై "తగ్గేదే లే" అంటున్న రష్యా విదేశాంగ శాఖ.. ఏం జరుగుతుందంటే?

international |  Suryaa Desk  | Published : Fri, Dec 27, 2024, 08:55 PM

ఉక్రెయిన్‌తో యుద్ధం ఇప్పట్లో ఆపేది లేదని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. తమ దేశం శాంతి, భద్రతలే తమకు ముఖ్యమని చెప్పిన ఆయన.. ఇప్పట్లో యుద్ధం ఆపితే ఆపై అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా ఇప్పుడు బలహీనపడిన ఉక్రెయిన్ యుద్ధం ఆపేసిన వెంటనే ఇతర దేశాల నుంచి ఆయుధాలు తెప్పించుకుని మరీ తమపై దాడికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకే తాము వెనక్కి తగ్గాలనుకోవటం లేదని చెప్పుకొచ్చారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. రెండు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈక్రమంలోనే తాజాగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి స్పందించారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గదని చెప్పుకొచ్చారు. రష్యాతో పాటు ఇతర దేశాల్లో సుదీర్ఘకాలం శాంతి నెలకొనేలా చట్టబద్ధమైన ఒప్పందాన్ని మాత్రమే తాము కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.


ఒకవేళ బలహీనమైన ఒప్పందం చేసుకుంటే ఆ తర్వాత అనేక సమస్యలు ఏర్పడతాయని సెర్గీ లావ్రోవ్ వివరించారు. ముఖ్యంగా పశ్చిమ దేశాలు అన్నీ కలికి ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసి.. ఆపై తమ మీదకు ఉసిగొల్పుతాయని అనుమానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ అదే కనుక జరిగితే తమ దేశంలో శాంతి, భద్రతలు లోపిస్తాయని స్పష్టం చేశారు. అందుకోసమే తాము ఉక్రెయిన్‌తో సంధికి ఏమాత్రం సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు.


రష్యా భద్రత కోసం పూర్తి హామీ ఇచ్చే షరతులు ఉ్న చట్టపరమైన ఒప్పందం ఉంటే తాము సంధికి సిద్ధమని లావ్రోవ్ తెలిపారు. అయితే ఆ సంధిని అస్సలే ఉల్లంఘించకుండా ఉండాలని కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు సిరియా గురించి కూడా మాట్లాడారు. ఆ దేశంలోని కొత్త పాలకులు తమతో దీర్ఘకాలం వ్యూహాత్మక సంబంధాలను కోరుకుంటున్నారని వివరిచారు. తాము కూడా ఈ విషయం గురంచి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.


ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపేందుకు తాము సిద్ధమని చెప్పారు. కాకపోతే దాడులు ఆపేందుకు ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధమన్న ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాత్రం మాట్లడబోనని వివరించారు. ముఖ్యంగా అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పదవి ఎక్కబోతున్న డొనాల్డ్ ట్రంప్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తాను ముగింపు పలుకుతానని చెప్పారు. అంటే ఆయనే ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదర్చబోతున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com