గతేడాది పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కావడం.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు రావడం అందరికీ తెలిసిందే. అయితే నిరసనకారులు చేసిన విధ్యంసంతో పోలీసులు దేశ వ్యాప్తంగా అనేక మందిని అరెస్ట్ చేశారు. మొత్తంగా 103 మందిని నిందితులుగా తేల్చి మిలిటరీ కోర్టుకు అప్పగించారు. అయితే ఏడాది నుంచి జైల్లోనే ఉన్న ఆ నిందితుల్లో 25 మందికి ఇటీవలే పాకిస్థాన్ మిలిటరీ కోర్టు శిక్షలు విధించింది. అయితే తాజాగా మరోసారి నిందితుల్లోనే మరో 60 మందికి జైలు శిక్షలు వేసింది. రెండు సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకూ ఒక్కొక్కరికీ ఒక్కోలా శిక్ష వేసింది.
2018లో పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పుకునేలా చేశారు. ముఖ్యంగా 2022లో పదవి వీచ్యుడైన ఆయనను ఆ తర్వాత కొంత కాలం పాటు పలు కారణాల వల్ల పోలీసులు నిర్బంధించారు. ఆపై 2023వ సంవత్సరం మే నెలలో అధికారికంగా అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆయన మద్దతుదారులు అంతా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అయితే అవి కాస్తా అల్లర్లకు దారి తీశాయి.
ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారులు ఆర్మీ ప్రధాన కార్యాలయాలతో పాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఎంత కట్టడి చేసినా ఆగలేరు. దీంతో వాళ్లు అనేక మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా వందల మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అందులో కేవలం 103 మందిని మాత్రమే నిందితులుగా తేల్చి పాకిస్థాన్ మిలిటరీ కోర్టుకు అప్పగించారు. ఇక అప్పటి నుంచి వారంతా జైల్లోనే ఉన్నారు.
అయితే వారం రోజుల క్రితమే మిలిటరీ కోర్టు మే 9 అల్లర్ల కేసును విచారించింది. ఈక్రమంలోనే నిందితులుగా ఉన్న 25 మందికి శిక్షలు విధించింది. ముఖ్యంగా 14 మందికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించిన కోర్టు.. మిగతా 11 మందికి తక్కువ శిక్షను విధించింది. అంతేకాకుండా త్వరలోనే మిగతా నిందితులకు కూడా శిక్షలు వేస్తామని ప్రకటించింది. చెప్పినట్లుగానే మిలిటరీ కోర్టు గురువారం రోజు మరికొంత మంది నిందితులకు శిక్షలు విధించింది. మొన్న కేవలం 25 మందికే శిక్షలు వేసిన న్యాయస్థానం ఈరోజు 60 మందికి శిక్షలు వేసింది.
అయితే మొన్నటిలాగే రెండు సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకూ ఒక్కొక్కరికీ ఒక్కోలా శిక్షలు విధించింది. శిక్ష పడిన వారు కాకుండా ఈ కేసులో నిందితులుగా ఇంకా 18 మంది ఉన్నారు. అయితే వారికి ఎప్పుడు శిక్షలు విధిస్తుందనేది మాత్రం పాకిస్థాన్ మిలిటరీ కోర్టు చెప్పలేదు. కానీ త్వరలోనే వీరికి కూడా శిక్షలు వేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.