తిరుపతి: తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడ నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు.నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా తితిదే ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. ''భక్తుల రద్దీ పెరుగుతుంటే తితిదే అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి. తమాషా అనుకోవద్దు'' అని వ్యాఖ్యానించారు.భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు? అని తితిదే జేఈవో గౌతమిని సీఎం ప్రశ్నించారు. జేఈవోగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అంబులెన్స్‌ల లభ్యత గురించి సీఎం ఆరా తీశారు. చంద్రబాబు వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు.