తిరుమల తొక్కిసలాటలో ఆరుగురు శ్రీవారి భక్తుల మృతికి చంద్రబాబు పాలనా వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అన్నారు. చంద్రబాబు వల్లే శ్రీవారి సేవే పరమావధిగా పనిచేయాల్సిన టీటీడీ కాస్తా టీడీపీ సేవలకు పరిమితమయ్యిందని విమర్శించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.... టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఘోర ప్రమాదం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంకు వచ్చే భక్తులకు టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, పలువురు గాయపడటం బాధాకరం. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తిరుమలపై ప్రతి అంశాన్ని వివాదంగా చేస్తున్నారని అన్నారు. వైయస్ జగన్ గారు తిరుమల దర్శనం కోసం వస్తున్నారని తెలియగానే ఈఓ, జెఈఓలు పెద్ద పెద్ద బోర్డ్ లు కట్టారు. ఆయన పర్యటన రద్దు అనగానే వెంటనే వాటిని తొలగించారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా వారు పనిచేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే వారు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. టీటీడీ ఛైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు వైయస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తన టీవీ చానెల్ లో పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రచారానికి ప్రతిఫలంగా ఆయనకు ఈ పదవి దక్కింది. టీటీడీ ఛైర్మన్ గా ఉండి కూడా వైయస్ జగన్ గారిపై రాజకీయపరమైన విమర్శలు చేశారు. ఆయనకు శ్రీవారి పట్ల నిజమైన భక్తి లేదు. ప్రతిసారీ తిరుమలపై వివాదాలను సృష్టించి, రాజకీయంగా వైయస్ఆర్ సీపీని అణచివేయడానికి బీఆర్ నాయుడు, ఈఓ, జెఈఓలు ప్రయత్నించారే తప్ప భక్తులకు సేవ చేయాలని ఏనాడు పనిచేయలేదు. వారి దుర్మార్గమైన ఆలోచనల వల్లే ఇటువంటి దుర్ఘటన జరిగింది. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన కూడా ఒక ప్రహాసనంలా కనిపిస్తోంది. ఈ కేసులో తన వారిని కాపాడుకునేందుకు కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు.