ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లుగానే.. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఆ ఎన్నికలు నిర్వహించడంతోనే తాను విజయం సాధించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తాజాగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ప్రధాని మోదీపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోదీ మూడోసారి కేంద్రంలో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనగర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. అప్పుడే కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు వాగ్దానం చేశారని గుర్తు చేశారు. అన్నట్లుగానే 4 నెలలలోపు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటైనట్లు వెల్లడించారు. ఆ ఎన్నికల ఫలితంగానే ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఎక్కడా రిగ్గింగ్, అధికార దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదులు లేవని వెల్లడించారు. అదే విధంగా జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తానని ప్రధానమంత్రి హామీ ఇచ్చారని.. త్వరలోనే ఆ హామీని నెరవేరుస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు. దాంతో మళ్లీ భారత్‌లో ఒక రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ అవతరిస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ కృషి వల్ల సరిహద్దుల్లో శాంతి భద్రతలు కొలిక్కి వచ్చాయని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
పర్యాటకపరంగా కూడా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. శ్రీనగర్-లేహ్ హైవేపై సోన్మార్గ్ ప్రాంతంలో నిర్మితమైన జడ్-మోడ్ టన్నెల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ జడ్-మోడ్ టన్నెల్ ప్రారంభంతో ఏ సీజన్లోనైనా లడఖ్‌ను చేరుకోవడానికి వీలు అవుతుందని చెప్పారు. దీనివల్ల సోన్‌మార్గ్‌కు పర్యాటకుల రాక పెరగనుందని పేర్కొన్నారు. దేశంలో గతేడాది లోక్‌సభ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడి ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్‌ను మళ్లీ రాష్ట్రంగా మారుస్తామని చెప్పారు. కాశ్మీర్ యువత చేతిలో రాళ్లను వదిలేసి విద్య, అభివృద్ధి వైపు వెళ్లాలని చూస్తున్నట్లు వెల్లడించారు.