తిరుమల శ్రీవారి ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. తిరుమల శ్రీనివాసుడిని చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతుంటారు. కానీ కొందరు భక్తులు చేస్తున్న నిర్వాకంతో తిరుమల పవిత్రతదెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా తిరుమలలో భద్రతా వైఫల్యం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేస్తోంది. తిరుమలకు చేరుకునే ముందు అలిపిరి వద్దే భద్రతా సిబ్బంది అన్ని వాహనాలను నిలిపివేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాహనంలో అనుమానంగా ఏమైనా ఉన్నా, నిషేధిత వస్తువులు ఉన్నా వాటిని తొలగించిన తర్వాతే తిరుమల కొండపైకి ఆ వాహనాలను అనుమతిస్తుంటారు.కానీ తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు చేసిన నిర్వాకంతో తిరుమల భద్రతలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. తిరుమలలో మాంసాహారం నిషేధం అన్నది అందరికి తెలిసిందే. కానీ తమిళనాడుకు చెందిన భక్తులు ఏకంగా తిరుమల కొండపైకే నిషేధిత ఆహారాన్ని తీసుకురావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ భక్తులు.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి నిషేధిత ఆహారంతో కొండకు వచ్చారా?.. లేక భద్రతా సిబ్బంది చూసీ చూడనట్టు వ్యవహరించారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి తమిళనాడు భక్తులు చేసిన పనికి తిరుమల భద్రతా సిబ్బందిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.