ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజధాని ప్రజలకు హామీల వర్షం కురిపిస్తోంది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వాసులకు తాజాగా మరో హామీని ప్రకటించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజధానిలో అద్దె ఇళ్లల్లో నివసించే వారికి ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని పేర్కొన్నారు. కాగా ఆప్ ఇప్పటికే వృద్ధుల కోసం సంజీవని స్కీమ్, మహిళల కోసం ‘మహిళా సమ్మాన్’ హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆప్ ఇప్పటికే వృద్ధుల కోసం సంజీవని స్కీమ్, మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,100 ఆర్థిక సాయం, అర్చకులకు రూ.18,000 గౌరవ వేతనం వంటి హామీలను ప్రకటించింది.ఫిబ్రవరి 5న జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను ఆకర్షించడానికి ఉచితాలపై దృష్టి పెట్టాయి.కాంగ్రెస్ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత రేషన్ కిట్లు, నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.8,500, మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం, రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా వంటి పథకాలను హామీగా ప్రకటించింది.