ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించి, ఎన్నో సంక్షేమ పధకాలకు ఆధ్యుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన గొప్ప దార్శనికుడు ఎన్టీఆర్ అని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగు నీరందించేలా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న లక్ష్యంతో రెండు రూపాయలకే కిలో బియ్యం పధకం తీసుకొచ్చి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించి ఆడపడుచులకు పెద్దన్నగా నిలిచారన్నారు. బలహీన వర్గాలకు చట్ట సభల్లో ఎక్కువ సీట్లు కేటాయించడమే కాకుండా అన్ని వర్గాల వారికి తగిన ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేసి ఎంతో మంది నాయకులను తయారు చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.