ఇటీవల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి.. యువత వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దానిపై వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలోనే ఇటీవల ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్.. తమ సంస్థ ఉద్యోగుల్ని వారానికి 90 గంటలు పనిచేయాలని.. ఆదివారాలు కూడా డ్యూటీ చేయాలని.. ఇంట్లో భార్య ముఖం ఎంత సేపు చూస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. పని- జీవితం సమతుల్యత (వర్క్ లైఫ్ బ్యాలెన్స్) అంశం తెరపైకి వచ్చింది. దిగ్గజ వ్యాపారవేత్తలు, పలు సంస్థల అధినేతలు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా ఈ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు చేసిన వారు ఐటీ, టెక్ రంగానికి చెందిన వారే కావడంతో.. అసలు ఈ ఐటీ రంగంలో ఉద్యోగుల ఒత్తిడి ఎలా ఉంటుందోననే విషయం కళ్లకు కట్టేలా చెబుతున్నారు కొందరు మాజీ ఉద్యోగులు.
ఇటీవల పుణెకు చెందిన భూపేంద్ర విశ్వకర్మ అనే వ్యక్తి.. తాను ఇన్ఫోసిస్‌లో పని చేసిన సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ లింక్డ్ఇన్‌లో రాజీనామా పోస్ట్ చేయగా ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది. వేరే జాబ్ ఆఫర్ లేకున్నా ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. కష్టపడి పనిచేసినా, అంచనాల్ని అందుకున్నా ప్రమోషన్స్ ఉన్నప్పటికీ.. హైక్స్ లేవని చెప్పుకొచ్చాడు. అదనపు పని ఒత్తిడి ఉండేదని సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఇదే ఇన్ఫోసిస్ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఒక పోస్ట్ చేయగా ఇది కూడా వైరల్ అవుతోంది.
ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి తాను అక్కడ పనిచేసిన సమయంలో అనుభవాల్ని పంచుకున్నారు. ఇక్కడ ఇన్ఫోసిస్‌లో, ఇతర కంపెనీల్లో పరిస్థితి ఎలా ఉందో వివరించాడు. ముఖ్యంగా ఐటీ కార్పొరేట్ కల్చర్, జీతభత్యాలు, నిశ్శబ్ద పని దోపిడీ వంటి అంశాల్ని ప్రస్తావించాడు. ముఖ్యంగా ఇండియాలో ప్రతి రంగంలో, ప్రతి విభాగానికి 'కనీస వేతన విధానం' తీసుకురావాలని,, ఇందుకోసం కార్మిక చట్టంలో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేశాడు. 'ఇన్ఫోసిస్‌లో నా 9 ఏళ్ల బంధింపపడని బానిసత్వం అనుభవాలు' అంటూ కొన్ని పాయింట్లను వివరించాడు. GoatTop607 ఐడీతో రెడిట్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మాజీ ఉద్యోగి మాటల్లో..
'2008లో ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్‌గా ఉద్యోగం ప్రారంభించా. 2017 వరకు అక్కడే ఉన్నా. తర్వాత టాప్- 4 ఐటీ కంపెనీలో ఒక దాంట్లో చేరాను. ఇప్పుడు బెంగళూరు, ఎకోస్పేస్‌లోని ఐటీ దిగ్గజ కంపెనీలో పనిచేస్తున్నా. నేను 9 సంవత్సరాలు ఇన్ఫోసిస్‌లో పనిచేసినందున ఇక్కడ ఉన్న నిబంధనలే అంతటా ఉన్నాయని అనుకున్నా. కానీ గత ఏడేళ్లుగా ఇతర సంస్థల్లో పని చూస్తే నాకు అసలు విషయం తెలిసింది. అవేంటో మీరే చూడండి.' అని మొదలుపెట్టాడు.
>> 9 ఏళ్లు పనిచేశాక ఇన్ఫోసిస్‌ను వీడుతున్న సమయంలో నా జీతం రూ. 35 వేలే. ఇప్పుడు నేను నెలకు రూ. 1.7 లక్షలు సంపాదిస్తున్నా. దాదాపు 400 శాతం ఎక్కువ. నేను ఇప్పటికీ నా అప్పటి సహచరుల్ని ఇన్ఫీ నుంచి మా కంపెనీకి రిఫర్ చేసినప్పుడు ఇప్పటికీ 80-100 శాతం పెంపు అందుకుంటున్నారు. దీనిని బట్టి అక్కడ జీతాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
>> ప్రస్తుత కంపెనీలో ట్రాన్స్‌పొర్టేషన్ ఫ్రీ.. అక్కడ నెలకు రూ. 3200 వసూలు చేసేవారు. ఇక్కడ పార్కింగ్ ఫ్రీ. ఇన్ఫోసిస్‌లో డబ్బులు వసూలు చేసేవారు. ప్రస్తుత కంపెనీలో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ రూ. 15-20 ఉంటుంది. రాయితీలో ఇస్తున్నందుకు నా కంపెనీకి కృతజ్ఞతలు. ఇన్ఫోసిస్‌లో ఇది రూ. 40 గా ఉండేది. ఇన్ఫోసిస్‌లో ప్రమోషన్ వచ్చినా.. లెవెల్ మారినా.. జీతాల పెంపు పెద్దగా ఉండేది కాదు.. బాధ్యతలు మారవు. అదే ప్రస్తుత కంపెనీలో బాధ్యతలు పెరగడంతో పాటు 15-25 శాతం వరకు పే హైక్ ఉంది.
>> ఇన్ఫోసిస్‌లో సింగిల్ డిజిట్ శాలరీ హైక్ (4-6 శాతం వరకు) వల్ల నాకు తక్కువ టేక్ హోమ్ శాలరీ వచ్చేది. ఇలా ఎన్నో ఏళ్లు వృథా చేసుకున్నా. ఉద్యోగం మారాలన్నా కష్టమే. ఇన్ఫీలో 90 రోజుల నోటీస్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు ఉద్యోగం మారడం కష్టంగా ఉండేది. ప్రస్తుత కంపెనీలో ఇతర చాలా కంపెనీల మాదిరే 2 నెలలు లేదా అంతకంటే తక్కువే ఉంది. కచ్చితంగా వారంలో మొత్తం ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. మార్కెట్ ట్రెండ్స్‌ను బట్టి జీతాల పెంపు అనేది ఇన్ఫోసిస్‌లో అస్సలు లేదు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ భద్రత అనేది పెద్ద అపోహ మాత్రమే. ఇన్ఫోసిస్‌ను వీడిన చాలా మంది నా సహోద్యోగులు 3-5 నెలల్లోనే కొత్త ఉద్యోగాల్లోకి చేరారు.
వీటన్నింటి గురించి వివరించిన సదరు యూజర్.. ఇది కేవలం తన భావన మాత్రమే కాదని.. వ్యవస్థలో మార్పుల గురించి ఆలోచించాల్సిన సమయం అని అన్నాడు. అందుకే దేశంలో అందరికీ కనీస వేతన విధానం రావాలని.. సంస్కరణలు రావాలని డిమాండ్ చేశాడు. ఇక కామెంట్లలో కూడా చాలా మంది సదరు మాజీ ఉద్యోగిని సమర్థించారు. పని విధానం మరీ అలా ఉందా.. అలాంటి వాటికి ఛార్జీలు వసూలు చేసిందా అంటూ పోస్టులు చేశారు.