ఇటీవలే అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి.. రెండోసారి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా జనవరి 20వ తేదీన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. మరో రెండు రోజుల్లోనే జరగబోతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టెక్ దిగ్గజాలతో పాటు అనేక దేశాలకు చెందిన నేతలు రాబోతున్నట్లు సమాచారం. మరి ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనే ప్రముఖులు ఎవరు, మొత్తం ఎంత మంది ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు అంతర్జాతీయ నాయకులు సైతం రాబోతున్నారు. ముఖ్యంగా ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అయితే చైనా నుంచి మాత్రం తమ ప్రతినిధిని పంపుతున్నట్లు జిన్‌పింగ్ ప్రభుత్వం చెప్పింది. అలాగే భారత దేశం నుంచి విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ వెళ్లనున్నారు. వీరితో పాటు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, హంగేరియన్ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్, బ్రెజీలియన్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, జపాన్ విదేశాంగ శాఖ మంత్రి తకేషి ఇవాయా, ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయూబ్ బుకెలే హాజరుకాబోతున్నారు.
కేవలం రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా టెక్ దిగ్గజాలు కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనబోతున్నారు. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా మాజీ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్‌లు రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఒబామా భార్యకు కూడా ఆహ్వానం వెళ్లగా ఆమె రానని తెగేసి చెప్పింది.
వీరితో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు అయిన జేక్ మరియ్ లోగాన్ పాల్, థియో వాన్, బ్రైస్ హాల్, నెల్ బాయ్ కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనబోతున్నారు. కైట్లిన్ జెన్నర్, అంబర్ రోజ్, డానా వైట్, మేగిన్ కెల్లీ వంటి ఇతర ప్రముఖులు కూడా హాజరుకాబోతున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. వాషింగ్టన్ నగరంలోని క్యాపిటర్ భవనంలో ఉన్న గోళాకార సముదాయంలో ఈ ప్రమాణా స్వీకారోత్సవ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు 25 వేల మంది సిబ్బంది భద్రతలో పాల్గొంటుండగా.. 30 మైళ్ల మేర తాత్కాలిక కంచెను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులు తప్ప మరెవరూ లోపలికి ప్రవేశించే వీలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.