ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా కు భక్తులు క్యూ కడుతున్నారు. సాధారణ ప్రజలతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. గంగ, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక అక్షయ, పాతాళ్‌పురి దేవాలయం, సరస్వతి కుండ్, హనుమాన్ దేవాలయాలను సందర్శించారు.మరోవైపు జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా వైభవోపేతంగా కొనసాగుతోంది. ఆరో రోజైన శనివారం ఉదయం 10 గంటల వరకు 19.8 లక్షల మంది కుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సుమారు 10 లక్షల మంది కల్పవాసీలు, 9.8 లక్షల మంది సాధారణ భక్తులు నదీ స్నానమాచరించినట్లు తెలిపింది. శనివారం పంచమ తిథి కావడంతో అమృత్ స్నానం ఆచరించేందుకు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 200 మంది గజఈతగాళ్లను సిద్ధం చేసింది. షిప్టుల వారీగా వారు విధులు నిర్వహిస్తున్నారు. 700 బోట్లతో నిరంతరం భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. శుక్రవారం సుమారు 7.3 కోట్ల మంది ప్రయాగ్ రాజ్‌కు వచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.