ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్.. నిమిషాల్లోనే సారీ చెప్పిన స్విగ్గీ, ఇంతకీ ఏం జరిగిందంటే?

national |  Suryaa Desk  | Published : Sat, Jan 18, 2025, 08:18 PM

టీఎంసీ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి వార్తల్లో నిలిచారు. బీజేపీ ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పార్లమెంటులో, మీడియా ముందు తీవ్రంగా విమర్శలు చేసే మహువా మొయిత్రా.. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోయింది. ఈ నేపథ్యంలోనే గత లోక్‌సభ పదవీ కాలంలోనే మహువా మొయిత్రా ఎంపీ పదవిపై వేటు పడటం.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఆమె మళ్లీ ఎంపీగా గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. అయితే తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి స్విగ్గీపై ఆమె ఫైర్ అయ్యారు.


తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా.. తాజాగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీలో ఒక ఐస్‌క్రీమ్‌ ఆర్డర్ చేసుకున్నారు. అయితే డెలివరీ అయిన ఐస్‌క్రీమ్‌ పాడైపోయిందని.. ఆమె ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాను ఒక ఖరీదైన మైనస్ థర్టీ మినీ స్టిక్స్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశానని.. కానీ అది పాడైపోయిందని తెలిపారు. ‘‘సారీ స్విగ్గీ.. ఒప్పుకునేదే లేదు.. ఇక మీ గేమ్ ఆపండి. నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి. లేదంటే ఆర్డర్ రీప్లేస్ చేయండి’’ అని మహువా మొయిత్రా ట్వీట్ చేశారు.


అయితే మహువా మొయిత్రా ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్ విలువ రూ.1220 గా ఉంది. ఇక జనవరి 16వ తేదీ రాత్రి 10.12 గంటలకు మహువా మొయిత్రా ఈ ట్వీట్ చేశారు. ఇక ఆమె ట్వీట్ చేసిన సరిగ్గా 22 నిమిషాలకు అంటే రాత్రి 10.34 గంటలకు స్విగ్గీ ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. "హాయ్ మహువా, మీరు ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌కు సంబంధించి తలెత్తిన సమస్యకు క్షమాపణలు. మీరు చేసిన ఆర్డర్ నంబర్ మాకు పంపించండి. మేం దాన్ని పరిశీలించి సమస్యకు పరిష్కారం కనుగొంటాం" అని స్విగ్గీ కేర్స్ రిప్లై ఇచ్చింది.


ఇక ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మహువా మొయిత్రాను స్విగ్గీ నుంచి జొమాటోకు మారాలని సూచించారు. మరికొందరు అయితే జొమాటో కూడా వేస్ట్ అంటూ మండిపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com